హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): పండగైనా… పబ్బమైనా… గాజుల రామారంలో కూల్చివేతలు తప్పవన్న హైడ్రా.. ఆ భూములపై ఇప్పుడు కుంటి సాకులు వెతుకుతున్నది. సామాన్యుడు తలదాచుకుంటున్న నిర్మాణాలు తెర వెనక రౌడీషీటర్లవంటూ ఎంగిలి బతుకమ్మ పండుగ రోజు.. నానా హంగామా సృష్టించిన హైడ్రా బుల్డోజర్లు విప్, ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ భూముల దగ్గరికి వచ్చేసరికి ముందుకు కదలడం లేదు. తొలిరోజు కూల్చివేతలు… రెండో రోజు ఫెన్సింగ్ పనులు చేపట్టిన హైడ్రా మూడోరోజు వెనక్కి తగ్గడం అనుమానాలకు తావిస్తున్నది. చివరకు అరికెపుడి గాంధీ అనుచరులు భూమి మీదకొచ్చి జేసీబీలతో చదును చేయడంతోపాటు హైడ్రా వేసిన ఫెన్సింగ్‌ను సైతం తొలగించి, చుట్టచుట్టి పక్కకు పడేశారు.
కానీ, ఎవరూ అటువైపు కన్నెత్తి చూడలేదు. చివరకు ఇప్పుడు హైకోర్టు స్టే! ఇక హైడ్రా ఇదే కారణాన్ని చూపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, గాంధీ తనదంటున్న భూమిలో మూడోరోజు హైడ్రా ఫెన్సింగ్ పనులు ఎందుకు చేపట్టలేదు? సున్నం చెరువు వద్ద నివాసాలను కూలిస్తే వేరే దిక్కులేక ఆ శిథిలాల మధ్యనే జీవిస్తున్న నిరుపేదలను అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్లాలని హుకూం జారీచేసిన అధికార యంత్రాంగం ఇక్కడెందుకు ఆ దూకుడు ప్రదర్శించడం లేదు? ఇంతకీ, హైడ్రా తొలిరోజు జారీచేసిన పత్రికా ప్రకటన మేరకు రూ.15వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను నిజంగానే కాపాడారా? లేదా? అనే దానిపై స్పష్టత కరువైంది.
కాంగ్రెస్ మార్క్ రాజకీయం
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని గాజుల రామారం భూముల వ్యవహారంలోనూ కాంగ్రెస్ సర్కార్ మార్కు రాజకీయమే తెరపైకొచ్చింది. అధికారంలోకి వచ్చింది మొదలు సామాన్యుడి కంటి మీద కునుకు లేకుండా కూల్చివేతల పర్వాన్ని కొనసాగిస్తున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పెద్దోళ్ల అక్రమాలపై మాత్రం ఉద్దేశపూర్వకంగా పక్కకు తప్పుకుంటున్నది. అందుకే ఆదిలో ‘చెరువులను చెరబడితే చెరసాలనే!, ‘ఎంత పెద్దవాళ్లున్నా అక్రమ ఫాంహౌస్‌లను కూల్చివేస్తాం’ అన్న ప్రభుత్వ పెద్ద ప్రసంగాలు గత కొంతకాలంగా వినిపించడం లేదు. హైడ్రా బుల్డోజర్లు పేదోళ్ల ఇండ్ల మీద ఒకలా! పెద్దోళ్ల భూముల దగ్గరికొచ్చే సరికి మరోలా!! వ్యవహరిస్తున్నాయి. గత 20 నెలల్లో ఇందుకు అనేక సాక్ష్యాలు బయటికిరాగా… తాజాగా గాజుల రామారంలో ఎస్ఎఫ్సీ భూముల్లోనూ స్పష్టంగా సర్కార్-హైడ్రా ద్వంద్వ వైఖరి కనిపిస్తున్నది. కూల్చివేతల రోజు హైడ్రా ఇచ్చిన పత్రికా ప్రకటనలోనే ‘బడాబాబుల కబ్జాలపై హైడ్రా ఉక్కుపాదం’ అనే శీర్షికతో సుదీర్ఘమైన సమాచారాన్ని ఇచ్చారు. ఇందులో సర్వే నంబర్ 307తోపాటు దానిని ఆనుకొని ఉన్న సర్వే నంబర్లలో 444 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్టు స్పష్టంగా పేర్కొన్నారు.
ప్రధానంగా హైడ్రా కూల్చివేతల్లో భాగంగా 12 ఎకరాల్లో ఉన్న లేఅవుట్ (విప్, ఎమ్మెల్యే అరికెపుడి గాంధీకి సంబంధించిన భూమి విస్తీర్ణం 12 ఎకరాలు)ను పూర్తిగా కూల్చివేశామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కూల్చివేతల్లో భాగంగా 260 నిర్మాణాలను కూల్చామని.. మరో 640 వరకు నిర్మాణాలను కూల్చివేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాధ్ ప్రెస్మీట్లో వెల్లడించారు. ఇదే సమయంలో క్షేత్రస్థాయిలోని హైడ్రా అధికారులు తొలిరోజు కూల్చివేతల తర్వాత రెండోరోజు ఫెన్సింగ్ ప్రక్రియను కూడా చేపట్టారు. ఈ మేరకు ప్రగతినగర్ వైపు ఉన్న అరికెపుడి గాంధీకి చెందిన 12 ఎకరాల లేఅవుట్‌ను స్వాధీనం చేసుకొని సుమారు 500 మీటర్ల వరకు ఫెన్సింగ్ కూడా వేసినట్టు తెలిసింది. కానీ, మరుసటి రోజు గాంధీ అనుచరులు వచ్చి హైడ్రా వేసిన ఫెన్సింగ్‌లో 300 మీటర్ల వరకు తొలగించి… బుల్డోజర్తో చదును కూడా చేసి తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు హైడ్రా కూల్చివేసిన నిర్మాణాల్లో తిరిగి పునరుద్ధరణగానీ, హైడ్రా ఫెన్సింగ్‌ను కూల్చివేసిన ఘటనలు కానీ చోటుచేసుకోలేదు. తొలిసారిగా గాంధీ అనుచరులు హైడ్రా ఫెన్సింగ్‌ను తొలగించినా ఇప్పటివరకు అటువైపు నుంచి ఎలాంటి స్పందన లేదు.
అతకని అబద్ధం
అబద్ధమాడినా అతికినట్టు ఉండాలంటరు! కానీ గాంధీకి చెందిన భూమిని స్వాధీనం చేసుకోవడంలో హైడ్రా చెప్తున్న కారణాలు మాత్రం అతికినట్టుగా ఉండటం లేదు. రెవెన్యూ అధికారులు తమకు హద్దు చూపనందున ఫెన్సింగ్ ఎక్కడినుంచి ఎక్కడికి వేయాల్నో తెలియడంలేదని చెప్తున్నారు. ఇదే నిజమైతే… అసలు రెవిన్యూ అధికారులు హద్దులు చూపకుండా, స్పష్టత ఇవ్వకుండా హైడ్రా కూల్చివేతలు ఎలా చేపట్టింది? 260 నివాసాల్లో సామాన్యులను బయటికి పంపి వాటిని ఏ ప్రాతిపదికన నేలమట్టం చేసింది? ముఖ్యంగా హైడ్రా జారీ చేసిన ప్రకటనలోనే సర్వే నంబర్లతో సహా 444 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నదని, అందులో 317 ఎకరాలను ఉమ్మడి రాష్ట్రంలో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు ఇచ్చారని పేర్కొన్నారంటే రెవెన్యూ అధికారుల నుంచి స్పష్టతలేనిదే ఈ సమాచారం హైడ్రాకు ఎవరిచ్చారు? ఏ ప్రాతిపదికన హైడ్రా అధికారికంగా ప్రకటించింది? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి తెరవెనక జరిగిన వ్యవహారంతోనే హైడ్రా పూర్తిగా వెనక్కి తగ్గిందని ప్రచారం జరుగుతున్నది.
హైడ్రా అధికారులు సామాన్యులు నివాసముండే నిర్మాణాల్ని కూల్చేదాకా ఎలాంటి ఆటంకాలూ రాలేదు. కనీసం ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించేవారూ కరవయ్యారు. కానీ, ఎప్పుడైతే గాంధీకి చెందినదిగా చెప్తున్న 12 ఎకరాల జోలికి హైడ్రా వెళ్లగానే ఆయనే స్వయంగా రంగంలోకి
దిగినట్టు చెప్తున్నారు. ప్రభుత్వ పెద్దలతో మాట్లాడుతూ కస్సుబుస్సు అనేసరికి హైడ్రాకు పైనుంచి సంకేతాలు రావడంతో అందరూ వెనక్కి తగ్గినట్టు స్పష్టమవుతున్నది.
హైడ్రా కూల్చివేతల్లో సామాన్యుడైనా, ప్రముఖుడైనా తేడా లేదనేది వాస్తవం కాదని మరోసారి ఈ సంఘటనతో తేలిపోయింది. అంతేకాదు, సున్నం చెరువుతో ఇతర అనేక ప్రాంతాల్లో హైకోర్టు ఉత్తర్వులను సైతం ఖాతరు చేయని హైడ్రా… ఇక్కడ మాత్రం పూర్తిగా బుల్డోజర్లను వెనక్కి తీసుకోవడంతోపాటు హైకోర్టు స్టే వచ్చేదాకా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు.