హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): అజ్ఞానుల చేతిలో రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్నదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తున్నదని, ప్రజా సమస్యలను పకదారి పట్టించడమే ధ్యేయంగా పనిచేస్తున్నదని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కేసీఆర్ హయాంలోని విద్యుత్తు కొనుగోళ్లపై సీబీఐ విచారణకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని, ఇది అత్యంత హాస్యాస్పదమని పేర్కొన్నారు. గతంలో రాహుల్‌గాంధీ సీబీఐని మోదీ జేబు సంస్థగా అభివర్ణించారని గుర్తుచేశారు. ఇప్పుడు అదే సంస్థకు కాంగ్రెస్ సర్కార్ విచారణ అప్పగించడం అంటే మోదీ కాళ్ల మీద పడటం కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణ పోలీసులపై ఈ ప్రభుత్వానికి నమ్మకం లేదా? వాళ్లు చేతకాని వాళ్లా? అని నిలదీశారు.
తెలంగాణభవన్‌లో మంగళవారం ఆయన మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్, బీఆర్ఎస్ నేతలు ఒంటెద్దు నరసింహారెడ్డి, రెగట్టె మల్లికార్జున్‌రెడ్డి, కిశోర్గౌడ్తో కలిసి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన ఏడాదిలోనే కేసీఆర్ విద్యుత్తు కష్టాలు తీర్చి 24 గంటల కరెంటు ఇచ్చారని, కానీ ప్రస్తుత ప్రభుత్వం రైతులకు 12 గంటలు కూడా సరిగా ఇవ్వలేకపోతున్నదని విమర్శించారు. గ్రామాలు, హైదరాబాద్‌లో కరెంటు పోతున్నదని, ఏ మంత్రయినా చర్చకు వస్తే నిరూపిస్తానని సవాల్ విసిరారు. కేసీఆర్ హయాంలో క్యాబినెట్ నిర్ణయాల కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూసేవారని, ఇప్పుడు ప్రజల గురించి ఆలోచించే నాథుడే సర్కార్‌లో లేరని ఆవేదన వ్యక్తంచేశారు.
అసలు విద్యుత్తు కొనుగోళ్లపై జస్టిస్ మదన్ బీ లోకూర్ ఎప్పుడు విచారణ జరిపారు? విచారణ జరిపి రిపోర్టు ఇస్తే అసెంబ్లీలో ఎందుకు పెట్టలేదు? అని జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ కమిషన్ రిపోర్ట్ కాళేశ్వరం రిపోర్టుకు ముందు ఇచ్చారా? తర్వాత ఇచ్చారా? మదన్ బీ లోకూర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టి వెళ్లారని తమ దగ్గర సమాచారం ఉన్నదని అన్నారు. కేసీఆర్ ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నారని, ఆయన ఎఫ్‌బీఐ, కేజీబీ, సీబీఐ… ఏ సంస్థ విచారణకు వచ్చినా భయపడరని స్పష్టంచేశారు.
రైతుభరోసా, ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ చేతకానితనాన్ని కప్పి పుచ్చుకొనేందుకే కేసీఆర్‌పై సీబీఐ విచారణ కోరారని విమర్శించారు. కాళేశ్వరం విషయంలో ఎలాగైతే నిజం బయటపడిందో, విద్యుత్తు విచారణలోనూ కేసీఆర్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వేస్తున్న సీబీఐ విచారణలపై ఆ పార్టీయే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ‘సీబీఐపై మాట్లాడిన రాహుల్‌గాంధీ వెధవ’ అని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, పీసీసీ అధ్యక్షుడు చెప్పదలుచుకున్నారా?’ అని ఎద్దేవా చేశారు.