హుస్నాబాద్ టౌన్, అక్టోబర్ 28: గౌరవెల్లి కాలువ నిర్మాణానికి తాము భూములు ఇవ్వబోమని రైతులు స్పష్టంచేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ శివారు నుంచి దాదాపు కిలోమీటరుపైగా గౌరవెల్లి రిజర్వాయర్ ఎడమ కాలువ 13 ఎల్ నిర్మాణం కోసం మంగళవారం భూసర్వేకు వచ్చిన ఇరిగేషన్ అధికారులను రైతులు అడ్డుకున్నారు. హుస్నాబాద్‌లో పురుగు మందుల డబ్బాలతో రైతులు ఆందోళనకు దిగారు. ఇందులో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు కూడా పాల్గొన్నారు. ఉన్న కొద్దిపాటి భూమిని కాలువ కోసం తీసుకుంటే తామెలా బతకాలని నిలదీశారు.
భూములు తీసుకోవద్దని ఇప్పటికే చాలాసార్లు వినతి పత్రాలు ఇచ్చామని, దౌర్జన్యంగా, దొంగచాటుగా సర్వేకు ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు. సర్వే నిలిపివేయకపోతే ఇక్కడే మందుతాగి చస్తామంటూ బెదిరించారు. దీంతో ఇరిగేషన్ ఏఈ నెహ్రూ ఆధ్వర్యంలోని అధికారులు సర్వేను నిలిపివేసి డీఈఈ, తహసీల్దార్‌కు సమాచారం తహసీల్దార్ లక్ష్మారెడ్డి వెంటనే అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు. ఇప్పటికే నిర్మించిన కాలువ నుంచి నీటిని ఎత్తిపోయాలని, కొత్త కాలువ నిర్మాణం అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న ఇరిగేషన్ డీఈఈ ప్రశాంత్‌తో రైతులు వాగ్వాదానికి దిగారు.
అలైన్మెంట్ మార్చేందుకు అవకాశం ఉన్నా, ఎందుకు మార్చడంలేదని ప్రశ్నించారు. గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణానికి భూమిపోయిందని, లక్షల రూపాయలు పెట్టి ఇంటి స్థలం కొన్నామని, ఇక్కడ కూడా కాలువ తీస్తే ఎలా బతకాలని రైతు లావుడ్యా బీమానాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇండ్ల స్థలాలు, కొద్దిపాటి వ్యవసాయ భూములు ఉన్న ఇండ్లకెల్లి కాలువలు తీస్తే ఊరుకునేదిలేదని హెచ్చరించారు. ఇప్పటికే తనకు గుండెపోటు వచ్చిందని రైతు మర్యాల మహేశ్వర్‌రెడ్డి అధికారులతో వాపోయాడు. అలైన్మెంట్ మార్చకపోతే పెట్రోలు పోసుకుంటానని కాంగ్రెస్ నాయకుడు బూరుగు కిష్టస్వామి పెట్రోల్డబ్బా చూపిస్తూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మరోసారి చర్చించి చర్యలు తీసుకుంటామని తహహసీల్దార్ లక్ష్మారెడ్డి, డీఈఈ ప్రశాంత్ రైతులకు హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.