వనపర్తి, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ) : వానకాలం సీజన్ ప్రారంభమై నాలుగు నెలలు గడుస్తున్నా వనపర్తి జిల్లాలో పంటల నమోదు ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఇప్పటికే వరి కోతలు ప్రారంభం కాగా, ఇతర పంటలైన మొక్కజొన్న సైతం పక్షం రోజుల కిందటి నుంచే మార్కెట్‌కు వస్తున్నది. వరి కొనుగోళ్లపై జిల్లా పౌరసరఫరాల శాఖ ఇప్పటికే అవసరమైన ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఈ మేరకు పంటల సాగు నమోదులు.. దిగుబడుల అంచనాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. వరి కొనుగోళ్లపై అనేక దఫాలుగా అధికార యంత్రాంగంతో జిల్లా కలెక్టర్ ఆదర్శ్‌సురభి పలు సమీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు.
ఇప్పటికీ క్రాప్
బుకింగ్ పూర్తి కాకపోవడంతో జిల్లాలో గందరగోళం నెల కొన్నది. వనపర్తి జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 3,74,284 ఎకరాలుంటే, ఇందులో ఇప్పటి వరకు 2.87 లక్షల ఎకరాల్లో సాగైన వివరాలను వ్యవసాయశాఖ సేకరించింది. జిల్లా వ్యాప్తంగా 72 క్లస్టర్లుగా గుర్తించబడ్డాయి. వీటి పరిధిలో ఏఈవోలు పంటల నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రధానంగా జిల్లాలో వరిని అధికంగా సాగు చేయగా, మొక్కజొన్న, పత్తి, కంది, పెసర, మినుములు, సోయా, వేరుశనగ తదితర పంటలు జిల్లాలో సాగు చేశారు. ప్రస్తుతం పంటల సాగు ఆధారంగానే కొనుగోళ్లు చేపడతున్నారు. వరి, మక్కలు, పత్తి తదితర పంటలను ప్రభుత్వమే మద్దతు ధరతో కొనుగోలు చేస్తుంది. ఈ క్రమంలో పంట లెక్కలు నమోదు డీలా పడడంతో కొనుగోళ్ల అంచనాల్లో తేడాలు వచ్చే అవకాశం ఉన్నది. అక్టోబర్ 31వ తేదీలోపు పంటల నమోదు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశాలున్నప్పటికీ పంటల వివరాల లెక్కలు తేల్చడంలో వ్యవసాయ శాఖ పూర్తిగా వెనుకబడింది.
హడావుడి మాత్రమే..
పంటల నమోదు గడువు చివరి దశకు వచ్చిన క్రమంలో వ్యవసాయ అధికారుల్లో హడావుడి మాత్రమే చేస్తున్నారు తప్పా.. క్షేత్ర స్థాయిలో వివరాలు సేకరించడం లేదు. ప్రతిఏటా పంటల నమోదు ప్రక్రియ వెనుకా.. ముందు అవుతున్నది. గతేడాది సమాచారం మేరకు ప్రస్తుత నమోదును కొంత అటు.. ఇటు చేస్తున్నారన్న విమర్శలు సైతం ఉన్నాయి. అయితే.. ప్రభుత్వం నుంచి వచ్చే ఎరువులు, ఇతర పథకాలకు పంటల నమోదు మేరకు కేటాయింపులు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో పంటల నమోదు కీలకం కానున్నది. ఇటీవల యూరియా లెక్కల్లోనూ అధికారుల అంచనాలకు.. రైతుల అవసరాలకు పొంతన లేకుండా పోయింది. గడచిన రెండు నెలలు యూరియా కోసం అన్నదాతలు ఎంతటి అవస్థలు పడ్డారో అందరికీ తెలిసిందే. ఏదైనా లెక్క పక్కాగా ఉంటే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయన్న అభిప్రాయం రైతుల నుంచి వ్యక్తమవుతున్నది.

78 శాతం నమోదు
జిల్లాలో ఇప్పటి వరకు 78 శాతం మాత్రమే పంటల నమోదు జరిగింది. ఇంకా 22 శాతం మిగిలి ఉన్నది. కేవలం రెండు రోజులు మాత్రమే నమోదుకు గడువు ఉన్నది. ఈ మేరకు 8 క్లస్టర్లు 60 శాతంలోపు ఉండగా, మరో 6 క్లస్టర్లు 70 శాతంలోపు, ఇంకో 15 క్లస్టర్లు 80 శాతంలోపు, 26 క్లస్టర్లు 90 శాతంలోపు ఉంటే కేవలం 17 క్లస్టర్లు మాత్రమే 90 శాతం పైబడి నమోదు చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇంకా మిగిలిన నమోదును తూతూ మంత్రంగా కానిచ్చే పనిలో వ్యవసాయాధికారులు ఉన్నట్లు స్పష్టమవుతున్నది. అధిక సమయం ఇచ్చినప్పుడే అంతంత మాత్రం జరిగిన నమోదు ప్రక్రియ ఇక చివరి దశలో తక్కువ టైంలో ఎలా పక్కాగా చేస్తారన్న ప్రశ్నలు వినబడుతున్నాయి. కాగా, జిల్లాను యూనిట్‌గా చూస్తే 78 శాతం మాత్రమే పంటల వివరాలు నమోదు చేసినట్లు తెలిసింది.
క్షేత్రస్థాయికి వెళ్తేనే పక్కాగా..
అధికారులు క్షేత్రస్థాయికి వెళ్తేనే సాగైన పంట నమోదు పక్కాగా ఉంటుంది. అయితే.. జిల్లాలో కొందరు క్రాప్ బుకింగ్‌ను కార్యాలయాల్లోనే ఉండి చేస్తుండడంతో అక్కడక్కడ విమర్శలు వెలువడుతున్నాయి. ఇంకొందరు ఏఈవోలు మాత్రం పొలాల వద్దకు వెళ్లి సర్వేను కొనసాగిస్తున్నారు. పంటల వివరాల నమోదు కోసం అధికారులు పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో పర్యటించడం లేదన్న ఆరోపణలున్నాయి. గ్రామాల్లో కొందరు దళారులు ఇలాంటి అవకాశాలను సొమ్ము చేసుకుంటున్నారు. అక్కడక్కడ రైతు వేదికలు, గ్రామ పంచాయతీల్లోనే పంట నమోదు వివరాలను లెక్కిస్తున్నారు. మరికొన్ని చోట్ల ఫోన్ల ద్వారా సమాచారం తీసుకుని మమ అనిపిస్తున్నారు. ఈ క్రమంలో పంటల నమోదు పక్కాగా చేయడం లేదన్న చర్చ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే.. క్లస్టర్ వారీగా 2 వేల ఎకరాలను డిజిటల్ క్రాప్ సర్వే చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. మిగిలిన పొలాలను క్షేత్రస్థాయికి వెళ్లి నమోదు చేయాల్సి ఉన్నది.