కొన్ని మెట్లు ఎక్కగానే ఊపిరి సరిగ్గా ఆడటం లేదా? ఆయాసంగా అనిపిస్తున్నదా? ఏ కొంచెం శారీరక శ్రమ చేసినా ఊపిరి సరిపోవడం లేదంటే దాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. వయసు పెరగడం, అలసట వల్ల ఇలా జరుగుతుంది. దీన్ని అయిదు ప్రధాన ఆరోగ్య సమస్యలకు హెచ్చరికగా భావించాలి. ఏదైనా అనుమానం అనిపిస్తే వెంటనే వైద్య సహాయం పొందాలి. తగిన చికిత్స తీసుకోవాలి.
శరీరం తగిన మోతాదులో ఎర్ర రక్త కణాలు లేదా హిమోగ్లోబిన్‌ను ఉత్పత్తి చేయకపోతే రక్తహీనత (ఎనీమియా) వస్తుంది. హిమోగ్లోబిన్ మనం పీల్చిన గాలి నుంచి ఆక్సిజన్ గ్రహించి శరీర అవయవాలకు సరఫరా చేస్తుంది. హిమోగ్లోబిన్ తగ్గితే శరీర కణజాలానికి ఆక్సిజన్ తగినంతగా అందదు. దీంతో శ్వాసించే క్రమం తగ్గిపోతుంది. ముఖ్యంగా శారీరక శ్రమ చేస్తున్నప్పుడు ఇలా జరుగుతుంది. కాబట్టి, చర్మం పచ్చబడటం, బలహీనత, అలసట మొదలైన వాటితో బాధపడుతుంటే అది రక్తహీనత లక్షణం కావచ్చు.
చిన్న ప్రయత్నానికే ఊపిరి సరిగ్గా ఆడటం లేదంటే అది గుండెజబ్బుకు సంకేతం కావచ్చు. వయసు పెరిగేకొద్ది గుండె రక్తాన్ని పంప్ చేసే శక్తి తగ్గుతూ వస్తుంది. దీంతో ఊపిరితిత్తుల్లో ఫ్లూయిడ్ పేరుకుంటుంది. మెట్లెక్కేటప్పుడు మీకు కండ్లు తిరగడం (డిజినెస్), కాళ్లవాపు, ఛాతినొప్పి లాంటి సమస్యలు వేధిస్తుంటే డాక్టర్‌ను కలవాలి. ఇది గుండె సమస్యలకు సంకేతం అయ్యుంటుంది.
మన శరీరానికి కావాల్సిన ఆక్సిజన్‌ను సరఫరా చేయడమే ఊపిరితిత్తుల పని. శ్వాసించడం కష్టమైపోతున్నదంటే అది ఊపిరితిత్తుల సమస్య కావచ్చు. ఆస్తమా, బ్రాంకైటిస్, ఇంటర్‌స్టీషియల్ లంగ్ డిసీజ్ (ఐఎల్‌డీ), క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సీఓపీడీ) లాంటివి ఊపిరితిత్తుల పనితీరును దెబ్బతీస్తాయి. ఫలితంగా ఏ కొంచెం శ్రమపడ్డా శ్వాసలో ఆటంకం (డిస్ప్నోయియా) కలుగుతుంది. దగ్గు, శ్వాస గుర్గుర్మని రావడం (వీజింగ్), ఛాతీలో అసౌకర్యంగా అనిపిస్తుంటే జాగ్రత్తగా ఉండాలి.
ఒత్తిడి, ఆందోళన కారణంగా కూడా ఊపిరి సరిగ్గా ఆడదు. అధిక ఒత్తిడి వల్ల శరీరం అడ్రినలిన్ హార్మోన్‌ను ఎక్కువగా విడుదల చేస్తుంది. ఇది శ్వాసించే క్రమాన్ని పెంచుతుంది. దీంతో సరిగ్గా శ్వాస పీల్చుకోవడం లేదనే భ్రమలో పడిపోతారు.
అధిక బరువు ఉంటే శరీరం తన సాధారణ విధులను నిర్వర్తించడానికి మరింత ప్రయత్నం చేయాల్సి వస్తుంది. అధిక కొవ్వు వల్ల డయాఫ్రమ్, ఊపిరితిత్తుల మీద ఒత్తిడి పడుతుంది. ఇది ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. దీంతో ఏ కొంచెం శారీరక శ్రమ చేసినా శ్వాస సరిపోని పరిస్థితి తలెత్తుతుంది.