‘ఆలస్యం అమృతం విషం!’.. అనే సూత్రం భోజనం విషయంలోనూ వర్తిస్తుందని చెబుతున్నారు ఆహార నిపుణులు. ఉరుకుల పరుగుల జీవితాలు, రాత్రి విధులు, పార్టీలు.. ఇలా పలు కారణాల వల్ల చాలామంది రాత్రి భోజనాన్ని ఆలస్యంగా ముగిస్తున్నారు. ఇలాంటి అలవాటు ఆరోగ్యానికి ఏమాత్రం మంచిదికాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రి భోజనం లేటైతే.. పలు అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని చెబుతున్నారు. ఆలస్యంగా తినే ఆహారం.. త్వరగా జీర్ణమవ్వదు. దీంతో గ్యాస్, అసిడిటీ, కడుపుబ్బరం వంటి జీర్ణ సంబంధ సమస్యలు ఎదురవుతాయి. ఇక ఇలా భోజనం చేసి, అలా పడుకొంటే.. నిద్రకు ఆటంకం కలుగుతుంది. జీర్ణక్రియ కూడా నెమ్మదిస్తుంది. అర్ధరాత్రి భోజనం చేయడం కొందరికి అలవాటు.
దీర్ఘకాలంలో ఈ అలవాటు గుండెకు హాని కలిగిస్తుంది. ఇక ఆహారం తీసుకోకపోవడం ఆలస్యమైతే.. జీవక్రియ మందగిస్తుంది. ఫలితంగా శరీరంలో కొవ్వు పెరగడం మొదలై.. ఊబకాయం బారినపడే ప్రమాదం ఉంటుంది. రాత్రిపూట కొవ్వులు, చక్కెరతో కూడిన ఆహారం ఎక్కువగా తీసుకుంటే.. పేగు క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది. రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయడం హార్మోన్ల అసమతుల్యతకూ దారితీస్తుంది. మానసిక ఒత్తిడి, డయాబెటిస్, గుండె సంబంధిత సమస్యలను తెచ్చిపెడుతుంది. కాబట్టి భోజనానికి, నిద్రకు మధ్య కనీసం మూడు గంటలైనా విరామం ఉండాలి. రాత్రి భోజనం తర్వాత ఓ 15 నిమిషాలైనా నడవాలి.