ఖమ్మం రూరల్ : వ్యాపార నిమిత్తం బ్రతకడానికి వచ్చి ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీలను కార్యకర్తలను బెదిరిస్తామంటే ఇక్కడ కుదిరేపని కాదని పాలేరు మాజీ ఎమ్మెల్యే కాందాల ఉపేందర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం 18వ డివిజన్ బారుగూడెం శ్రీ సిటీ ఏడవ వార్డు గుర్రాలపాడు తదితర కాలనీలో బీఆర్ఎస్, సీపీఎం కూటమి తరఫున రోడ్ షో నిర్వహించారు.
అనంతరం ఆయా కూడళ్లలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్ అధ్యక్షతన జరిగిన సభలలో కందాల, తాత మధు మాట్లాడారు. వ్యాపారస్తులు వ్యాపారస్తులుగా ఉంటేనే చూసేవారికి బాగుంటుందన్నారు. అలా కాదని గీత దాటి ప్రవర్తిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని ఘాటుగా హెచ్చరించారు. పైసా పైసా కూడపెట్టి ప్లాట్లుకొని, ఇల్లులు కట్టుకుని జీవనాధారం వెళ్లదీస్తున్న వారిని ఓట్ల పేరుతో బెదిరిస్తున్నారని, ఇది వ్యాపారులకు తగదు వార్నింగ్ ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు తమ వెంచర్లకు, అపార్ట్మెంట్లకు రావద్దని అనే హక్కు మీకు లేదని చెప్పారు.
ఎదుటి కార్యకర్తలను ఇబ్బంది పెడితే వారి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలన్నారు. ఏ ఒక్క వ్యాపారికి భయపడాల్సిన అవసరం లేదని, ఏ చిన్న సమస్య వచ్చినా కందాల ఒక్క ఫోన్ కాల్లో మీ ముందు ఉంటాడని హామీ ఇచ్చారు. చివరి వరకు పార్టీతో వెన్నంటి ఉండి ఆఖరిలో పార్టీని మోసం చేసిన వారికి ఈ ఎన్నికలలో కర్రుకాల్చి వాత పెట్టాలన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులు రికార్డుస్థాయి మెజారిటీతో గెలవబోతున్నారని ధీమా వ్యక్తంచేశారు. రానున్న మూడు రోజులు బీఆర్ఎస్, సీపీఎం కూటమి నాయకులతోపాటు పార్టీ అభ్యర్థులకు మద్దతు పలుకుతున్న తెలుగుదేశం కార్యకర్తలు సైతం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
అధికార పార్టీ చివరి వరకు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు అధికార దర్పం ప్రదర్శించిన ఓటర్లు ఇప్పటికే ఫిక్స్ అయ్యారన్నారు. ఏదులాపురం మున్సిపల్ ఓటర్ల ప్రభంజనం అడ్డుకోటం ఇక ఎవరి తరం కాబోదని చెప్పారు. రెండు మూడు రోజుల్లోనే ఏదులాపురం గులాబీ పరం అవుతుందని, గులాబీపురంగా మారబోతుందని అన్నారు. సంపూర్ణ మెజార్టీతో కూటమి అభ్యర్థులు చైర్మన్, వైస్ చైర్మన్‌తోపాటు పూర్తి పాలకవర్గాన్ని వశం చేసుకోబోతున్నారని చెప్పారు. కారు గుర్తుకు ఓటు వేసేందుకు ప్రతి కుటుంబం ఎదురు చూస్తుందని, ఈ తీర్పు రాష్ట్రంలోనే ఓ చారిత్రాత్మకం కాబోతుందని అన్నారు.
పొన్నగంటి బాలమ్మ, బొల్లం నాగయ్యలను ఆశీర్వదించి కౌన్సిల్‌కు పంపిస్తే మీ వార్డులు అభివృద్ధి చేయించే బాధ్యత తమదేనని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పాలేరు డివిజన్ కార్యదర్శి బండి రమేష్, డీసీసీబీ ఖమ్మం జిల్లా మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, పలువురు యాదవ, గౌడ సంఘం జిల్లా ముఖ్య నాయకులు, ఆయా గ్రామాల బీఆర్ఎస్ పార్టీ నేతలు, పార్టీ ఇన్చార్జిలు పాల్గొన్నారు.