టెహ్రాన్, వాషింగ్టన్, మార్చి 21: పశ్చిమాసియా యుద్ధాన్ని ట్రంప్ ముగించాలనుకొంటున్నా.. ఇజ్రాయెల్ మాత్రం కొనసాగించాలనుకొంటున్నది. మరోవైపు ఇరాన్ కూడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేనట్టు మొండిగా యుద్ధం చేస్తున్నది. తాజాగా ఇరాన్‌లోని నటాంజ్ అణు కేంద్రంపై శనివారం యూఎస్, ఇజ్రాయెల్ దళాలు మరోసారి దాడి చేయడం ఇందుకు కారణం. ఇరాన్‌పై సైనిక చర్యను క్రమంగా తగ్గించే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు ట్రంప్ శనివారం తెలిపారు. అయితే కాల్పుల విరమణకు మాత్రం తాను సిద్ధంగా లేనని పేర్కొన్నారు. కానీ ఆదివారం నుంచి ఇరాన్‌పై తమ దాడులను మరింత తీవ్రతరం చేస్తామని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి కట్జ్ హెచ్చరించారు. ఇంకోవైపు ప్రపంచ దేశాలు యుద్ధం పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశాయి. యుద్ధాన్ని ఆపాలని 22 దేశాలు ఇజ్రాయెల్‌కు విజ్ఞప్తి చేశాయి.
ఈ పరిణామాల మధ్య ప్రపంచ ప్రజలకు ఉపశమనం కలిగించే విషయం.. ఇరాన్ చమురు సరఫరాపై ఆంక్షలను తొలగిస్తున్నట్టు అమెరికా ప్రకటించడం! నటాంజ్ అణు కేంద్రంపై జరిగిన దాడిలో రేడియో ధార్మిక పదార్థాలేవీ లీక్ కాలేదని ఆ దేశ అటమిక్ అనర్జీ ఆర్గనైజేషన్ తెలిపింది. కేంద్రం పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఎలాంటి ప్రమాదం లేదని తెలిపింది. తాజా దాడులను ఇరాన్ అణు ఇంధన సంస్థ తీవ్రంగా ఖండించింది. ఈ దాడులు అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక చట్టం, ఇతర అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించాయని ఆరోపించింది. యూఎస్-ఇజ్రాయెల్ తమ అణు కేంద్రంపై దాడి చేసిన విషయాన్ని ఇరాన్‌కు తమకు తెలియజేసిందని ఇంటర్నేషనల్ అటమిక్ ఎనర్జీ అసోసియేషన్ (ఐఏఈఏ) ఎక్స్‌లో వెల్లడించింది. దాడి అనంతరం బయటి ప్రదేశాలలో రేడియేషన్ స్థాయి పెరిగినట్టు తమకు ఎలాంటి సమాచారం అందలేదని, అయితే తాజా నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్టు ఆ సంస్థ తెలిపింది. మార్చి 3న నటాంజ్ సైట్‌పై యూఎస్-ఇజ్రాయెల్ దళాలు చేసిన దాడిలో అక్కడి పలు భవనాలు దెబ్బ తిన్నట్టు ఉపగ్రహ చిత్రాలు వెల్లడించాయని పేర్కొన్నాయి.
ఇరాన్ క్షిపణి పరిధిలో అమెరికా?
పశ్చిమాసియా పోరు హిందూ మహా సముద్రానికి వ్యాపించింది! ఆ సముద్రంలోని అమెరికా-బ్రిటన్ సైనిక స్థావరం డీగో గార్సియాను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ రెండు మధ్య శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు అధికారిక మెహర్ వార్తా సంస్థ వెల్లడించింది. ఈ రెండు క్షిపణులలో ఏదీ లక్ష్యాన్ని తాకనప్పటికీ ఈ దాడి ఇరాన్ ఆయుధ సామర్థ్యం పెరుగుదలను సూచిస్తుంది. డీగో గార్సియాను లక్ష్యంగా చేసుకోవడాన్ని ఇరాన్ క్షిపణుల పరిధి శత్రువు గతంలో ఊహించన దానికంటే చాలా ఎక్కువని చూపించే ఒక ముఖ్యమైన ముందడుగుగా మెహర్ అభివర్ణించింది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణుల్లో ఒకటి మధ్యలోనే విఫలం కాగా రెండో క్షిపణిని అమెరికా యుద్ధ నౌక ఎస్ఎం-3 ఇంటర్‌సెప్టర్‌ని పేల్చిందని అఅమెరికా అధికారులు తెలిపారు. అయితే ఎస్ఎం-3 ఇంటర్‌సెప్టర్ విజయవంతమైనదీ లేనిదీ స్పష్టం కాలేదు. హిందూ మహాసముద్రంలో స్థావరం ఏర్పర్చుకున్న డీగో గార్సియాపై ఇరాన్ నిర్లక్ష్య క్షిపణి దాడిని బ్రిటన్ ఖండించింది. డీగో గార్సియా ఇరాన్‌కు సుమారు 4 వేల కిలో మీటర్ల దూరంలో ఉండడం వల్ల ఈ దాడి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.
ఇది ఇరాన్ బహిరంగంగా అంగీకరించిన బాలిస్టిక్ క్షిపణుల పరిధికి రెట్టింపు దూరం. తమ దేశ క్షిపణులు 2 వేల కిలోమీటర్ల దూరం వరకు చేరుకోగలవని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఖ్చీ గతంలో వెల్లడించారు. ఈ దాడి లక్ష్యాన్ని చేరకపోయినప్పటికీ ఇరాన్ వాస్తవ సామర్థ్యాలను ప్రపంచం పునఃపరిశీలించుకునేలా ఇది చేయనున్నది. ఈ దూరం నుండి దాడికి ప్రయత్నించడం ద్వారా ఇరాన్ తన పరిధిని మునుపటి అంచనాలకు మించి విస్తరించగల సామర్థ్యాన్ని ప్రదర్శించి హిందూ మహాసముద్రంలో అమెరికా, బ్రిటన్ వ్యూహాత్మక ప్రణాళికలకు అనిశ్చితిని సృష్టించింది. డీగో గార్సియాపై దాడి ద్వారా ఇరాన్ తన యుద్ధ రంగ పరిధిని పశ్చిమాసియా నుంచి హిందూ మహాసముద్రానికి విస్తరించింది. ఈ ప్రయత్నం అమెరికా స్థావరం ఎంత దూరంలో ఉన్నప్పటికీ ఇరాన్‌కు అందనంత దూరంలో లేదని సంకేతమిస్తోంది. దక్షిణ ఐరోపా లేదా హిందూ మహాసముద్రంలో మరింత దూరం వరకు చేరగలిగే సామర్థ్యం ఉన్న నిజమైన మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యాలను ఇరాన్ పరీక్షిస్తుండవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
ఇరాన్ క్షిపణులపై యూరప్‌లో ఆందోళన
చాగోస్ దీవులలోని బ్రిటిష్-అమెరికా స్థావరంపై ఇరాన్ జరిపిన బాలిస్టిక్ క్షిపణి దాడితో ప్రధాన యూరోపియన్ రాజధానులు ఇప్పుడు ఇస్లామిక్ తీవ్రవాద పాలన నుండి మరో దాడికి గురయ్యే ప్రమాదంలో ఉన్నాయనే భయాలను పెంచింది. ఇరాన్ దాడితో లండన్ ప్రమాదపు అంచుకు మరింత చేరువ అవుతోందనే ఆందోళన ఐరోపా దేశాలలో నెలకొంది. బ్రిటన్-అమెరికా సైనిక స్థావరాలు ఏర్పర్చుకున్న డీగో గార్సియా ఇరాన్‌కు దాదాపు 3,800 కిలోమీటర్ల దూరంలో ఉంది. తమ మధ్య శ్రేణి బాలిస్టిక్ క్షిపణులు కేవలం 2,000 కిలోమీటర్లు మాత్రమే వెళ్లగలవని ఇరాన్ గతంలో చెప్పింది. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యం మరింత ఎక్కువగా ఉంటే ఆ దేశం క్షిపణి ముప్పు పశ్చిమ యూరోప్‌లోని చాలా రాజధాని నగరాలకు విస్తరించగలదని నిపుణులు హెచ్చరించారు.
దాడులు ఆపి హొర్ముజ్ తెరువాలి
దాడులను నిలిపివేసి హొర్ముజ్ జల సంధిని తిరిగి తెరువాలని ఇరాన్‌ను 22 దేశాలు శనివారం అర్థించాయి. వాణిజ్య నౌకలతోపాటు పశ్చిమాసియాలోని చమురు, గ్యాసు సదుపాయాలపై ఇరాన్ చేస్తున్న దాడులను యూఏఈ, బహ్రెయిన్, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియాతో సహా 22 దేశాలు ఖండించాయి. ఇరాన్ చర్యల ప్రభావం ప్రపంచంలోని అన్ని ప్రాంతాల ప్రజలపైన ముఖ్యంగా బలహీన వర్గాలపైన పడుతున్నదని శనివారం ఓ సంయుక్త ప్రకటనలో ఆ దేశాలు పేర్కొన్నాయి.
జెరూసలెంపై ఇరాన్ క్షిపణి దాడి
ఇజ్రాయెల్‌లోని జెరూసలెం పాత నగరంపై శుక్రవారం ఇరాన్ క్షిపణి దాడి చేసింది. అయితే ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ దాన్ని అడ్డుకోవడంతో క్షిపణి శకలాలు పవిత్ర ప్రదేశాలకు అత్యంత చేరువలో పడి నష్టం చేకూర్చడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. అత్యంత పవిత్రంగా భావించే చారిత్రక కట్టడాలైన వెస్టర్న్ వాల్, టెంపుల్ మౌంట్‌పై ఉన్న అల్-అక్సా మసీదు ప్రాంగణానికి సుమారు 400 మీటర్ల దూరంలో ఇరాన్ క్షిపణి శకలాలు పడ్డాయి. యూదుల నివాస ప్రాంతాన్ని తాకి, ఒక పార్కింగ్ స్థలానికి నష్టం కలిగించాయి.
యుద్ధంపై ట్రంప్ పీచేముడ్!
ఇరాన్‌తో అమెరికా సాగిస్తున్న యుద్ధం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ఇంటా బయటా కొత్త సవాళ్లను తెచ్చిపెట్టింది. దీంతో ఈ యుద్ధం నుంచి మెల్లగా బయటపడే ఆలోచన చేస్తున్నారు. ఆయన ‘పీచేముడ్’ అనే రోజు ఎంతో దూరంలో లేదని ఆయన తాజా వ్యాఖ్యలను బట్టి తెలుస్తున్నది. యుద్ధం ముగించే విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మాట్లాడుతూ.. ఇరాన్‌పై సైనిక చర్యను క్రమంగా తగ్గించే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిపారు. అయితే కాల్పుల విరమణకు మాత్రం తాను సిద్ధంగా లేనని పేర్కొన్నారు. ఇరాన్‌పై సాధించిన సైనిక విజయాలను వివరిస్తూ ‘ట్రూత్ సోషల్’ వేదికగా ట్రంప్ ఒక పోస్ట్ పెట్టారు. ఇరాన్‌పై తమ లక్ష్యాలను చేరుకోవడానికి చాలా దగ్గరగా ఉన్నామని తెలిపారు. తమ దేశ సైనిక చర్యను ముగించే విషయంపై ఆలోచిస్తున్నట్టు వెల్లడించారు. ఇరాన్ క్షిపణి సామర్థ్యాలను, వైమానిక, నావికా వ్యవస్థలను పూర్తిగా ధ్వంసం చేసినట్టు తెలిపారు. హొర్ముజ్ జలసంధి గురించి ప్రస్తావిస్తూ, దీనిపై ఆధారపడిన దేశాలు నౌకల సురక్షిత ప్రయాణానికి బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.
నౌక మార్గాలు తెరచి ఉంచాలి: మోదీ
పశ్చిమాసియా పరిస్థితిపై తాను ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌తో ఫోన్లో సంభాషించినట్టు ప్రధాని మోదీ శనివారం తెలిపారు. హొర్ముజ్ జల సంధి గుండా నౌకాయానం స్వేచ్ఛగా సాగాలని, నౌకా మార్గాలను తెరచి ఉంచి, వాటిని సురక్షితంగా ఉండేలా చూసుకోవాల్సిన అవసరం ఉందని తాను ఆయనకు చెప్పినట్టు మోదీ తెలియజేశారు. దౌత్య మార్గాల్లోనే సంక్షోభాలను పరిష్కరించుకోవాలని మోదీ ఆయనకు సూచించారు.
ఇరాన్ చమురుపై ఆంక్షలు ఎత్తివేత
పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో ఇంధన సరఫరాపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ట్రంప్ యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకున్నది. సముద్రంలో నిలిచిపోయిన ఇరాన్ చమురుపై ఆంక్షలను ఎత్తివేస్తున్నట్టు శనివారం ప్రకటించింది. ఆ దేశ చమురు అమ్మకాలకు 30 రోజుల మినహాయింపు జారీ చేసింది. అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ ఈ విషయాన్ని ప్రకటించారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు సరఫరాను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఈ తాత్కాలిక చర్యతో 14 కోట్ల బ్యారెళ్ల ఇరాన్ చమురు ప్రపంచ మార్కెట్లోకి వస్తుందన్నారు.