సిటీబ్యూరో, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): సినీ నటుడు మోహన్‌బాబును అరెస్ట్ చేసేందుకు రాచకొండ పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇందు కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు ప్రచారం జరుగుతుంది. జల్పల్లిలోని మోహన్‌బాబు ఇంటి వద్ద మీడియా ప్రతినిధులపై జరిగిన దాడి ఘటనలో పహాడీషరీఫ్ ఠాణాలో మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ కేసులో మోహన్‌బాబు ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే శుక్రవారం హైదరాబాద్ పోలీసులు సినీ నటుడు అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం, ఆయనకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఇంతలోనే మోహన్‌బాబును కూడా పోలీసులు అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అల్లు అర్జున్ను.. కేసు హైకోర్టులో ఉండగానే పోలీసులు అరెస్ట్ చేశారు. తనను కూడా పోలీసులు ఎప్పుడైనా అరెస్ట్ చేసే అవకాశముందని భావించి మోహన్‌బాబు తన జాగ్రత్తలో ఉంటాడని చర్చ జరుగుతుంది. ఈ విషయంపై రాచకొండ పోలీసులు ఎవరు స్పందించలేదు.