మా బాబు వయసు ఆరేండ్లు. బడికి చక్కగా వెళ్తున్నాడు. ఆటపాటల్లో హుషారుగా ఉన్నాడు. చదువులోనూ చురుకే. కానీ, రెండు వారాలుగా చూపులో తేడా వచ్చింది. కంటిలో మెల్ల అనిపిస్తోందని కంటి వైద్యులకు చూపించాం. పరీక్ష చేసి సమస్య లేదన్నారు. కానీ, న్యూరాలజీ డాక్టర్కి చూపించాలన్నారు. మేం కొంచెం కంగారు పడ్డాం. మెల్లకన్ను ప్రమాదకరమా?
కంటిలో నిర్మాణ పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మెల్లకన్ను ఉంటే ప్రమాదకరం కాదు. పిల్లల్లో మొదటి ఆరు నెలల వయసులో కొంత మెల్ల ఉంటుంది. కంటి చూపుతోపాటు కంటి కదలికలు బాగుంటే కంగారు పడేది ఏమీ లేదు. రెండు కండ్లూ ఒకేవైపు చూడకుండా ఒక కన్ను ఒకవైపు, మరో కన్ను ఇంకోవైపు ఉండి, రెండు కండ్ల మధ్య దృష్టి సమన్వయం లేకపోతే దాన్ని మెల్ల అంటారు. రెండు కండ్లకు అనుసంధానమై ఉన్న నాడులపై ఇతర ప్రభావాల వల్ల ఇలా జరుగుతుంది. మెదడు నిర్మాణంలో లోపాలు ఉన్నా, మెదడులో కణుతులు ఏర్పడినా కూడా మెల్లకన్ను రావొచ్చు. అందుకే న్యూరాలజిస్ట్కి చూపించమని కంటి వైద్యులు మీకు సలహా ఇచ్చారు. ఆలస్యం చేయకుండా పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్కి చూపించండి. అవసరమైన పరీక్షలు చేయించండి. ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. మెదడులో ఏ సమస్యా లేకుంటే ఇబ్బంది లేదు. చూపులో తేడా ఉంటే అంధత్వానికి దారితీసే ప్రమాదం ఉంది. న్యూరాలజిస్ట్కి చూపించిన తర్వాత కంటి వైద్యుల పర్యవేక్షణలో తగిన చికిత్స అందించడం బిడ్డకు ఎంతో అవసరం.