హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): విద్యార్థులు చదువుతూనే సంపాదించడం, చదువు పూర్తయ్యాక ప్లేస్‌మెంట్స్ కల్పించడం లక్ష్యంగా విద్యాశాఖ ప్రణాళికాబద్ధంగా ముందుకెళుతున్నది. పాలిటెక్నిక్ విద్యార్థులు నెలకు రూ. 12 వేల నుంచి రూ.18 వేలు, డిగ్రీ విద్యార్థులు నెలకు రూ. 8వేల నుంచి రూ. 12 వేలు సంపాదించే అవకాశాన్ని కల్పించనున్నది. డిగ్రీ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్, పాలిటెక్నిక్ విద్యార్థులకు అప్రెంటిస్‌షిప్ కల్పించనున్నారు.
దీంట్లో భాగంగా ఈ నెల 11న వందకుపైగా కంపెనీలతో సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో ఎంవోయూ కుదుర్చుకోనున్నారు. బుధవారం గచ్చిబౌలిలోని టీహబ్‌లో ఇండస్ట్రీ- అకాడమియా అనుసంధాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తయారీ, రిటైల్, మార్కెటింగ్, లాజిస్టిక్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, లైఫ్ సైన్సెస్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఎమర్జింగ్ రంగాల్లో ఒప్పందాలపై కీలక చర్చలు జరిగాయి.