ఏమిటీ చిత్రమైన కోరికలు.. అనిపిస్తున్నాయి కదూ! కాలేజీ క్యాంపస్‌లలోనూ, క్లాస్ రూం బెంచీలపైనా, కేఫిటేరియా టేబుల్ మీదా, ఇన్‌స్టా స్టేటస్లు, రీల్స్‌లో.. నిశితంగా చూస్తే తెలుస్తుంది. ఉరకలేసే వయసులో రాసిన కొంటె స్టేటస్లు అవన్నీ అని! నేటి జెన్ జీ (90వ దశకం చివరి నుంచి 2010 దాకా పుట్టిన) అమ్మాయిల మ్యాడ్ కోరికల చిట్టా ఇది అని. ఎవరు, ఎక్కడ రాశారనేది కాసేపు పక్కన పెడితే… వీళ్ల గట్స్‌కి ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. కచ్చితంగా వారేం కోరుకుంటున్నారో ప్రపంచానికి చెప్పే ప్రయత్నం ఇది. నిజంగా వాళ్లకెంత ధైర్యం? స్వీట్ సిక్స్టీన్లోకి ఎంటర్ అవ్వగానే జెన్ జీ యూత్ కి ప్రపంచం చిత్రంగా కనిపిస్తుందనుకుంటా. వారి అడ్వంచెర్ లు మాములుగా ఉండవు.. ఈ విషయంలో నేటి తరం అమ్మాయిలు అస్సలు తగ్గట్లేదు. అప్పుడెప్పుడో టెస్ట్ పుస్తకాల్లో దాచుకున్న నెమలి పించం పురివిప్పి ఆడుతుందేమో!! చేతుల్లో పుస్తకాలు గాల్లోకి ఎగురుతాయి! అక్కడే ఓ ట్యూన్ స్టార్ట్ అవుతుంది.
Life Style | ‘హే కళ్ళజోడు కాలేజీ పాప జూడు ఎల్లారెడ్డిగూడ కాడ ఆపి జూడు..’ అంటూ పాటలు… స్టెప్పులు… అమ్మాయి అస్సలు తగ్గేదే లే అంటూ ‘హీరో హోండా బండి మీద పోరడు జూడు.. కూలింగ్ గ్లాసు పెట్టి కట్టింగ్ ఇస్తడాడు..’ అంటూ రివర్స్ కౌంటర్. మనసు మాట వింటుందా? దిల్ చాహతాహై… అంటూ మరింత తొందరపెడుతుంది. వయసలాంటిది… దాని సహజ నైజం! కానీ ఎవరిని కోరుకుంటుంది? ఎందుకు కోరుకుంటుంది? ఇప్పుడు అవసరమా? కాదా? అనే ప్రశ్నలకు మాత్రం ప్రిపరేషన్ ఉండదు. అంతా ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్సే. ఇంట్లోనూ, క్లాస్‌లోనూ వాట్సాప్ గైస్ అంటూ హై-ఫై లు… ‘ఏం చిచ్చా.. ఈ మధ్య రీల్స్ పెడతలేవ్. డేటా రీఛార్జ్ చేయమంటవా?’ అంటూ అబ్బాయిపై కామెంట్లు. ‘మన మ్యాథ్స్ సార్ సూపర్ కట్ అవుట్.. ఒక్క రీల్ సార్ తో చేస్తే వేరే లెవల్’ అంటున్నారంటే… అర్థం చేసుకోవాలి, ఒకప్పుడు ఎత్తిన తల దించకుండా ఇంటి గేటు తీసే అమ్మళ్లు… ఇప్పుడు తలెత్తి ప్రపంచాన్ని ఎంత ఎక్స్ ప్లోర్ చేస్తున్నారో!
కట్టుబాట్లు.. కల్చర్.. సంప్రదాయాలు.. వీటిని రీడిఫైన్ చేస్తున్నారు జెన్ జీలు. సమానత్వాల్ని బ్యాలెన్స్ చేస్తున్నారు. మొహమాటాల్ని పక్కన పెట్టేస్తున్నారు… ఏ విషయంలోనూ గెలుపు ఓటముల గురించి ఆలోచించట్లేదు. గిరి గీసుకోవడాలు అస్సలు లేవు. అచ్చం బొమ్మరిల్లు సినిమాలో హాసినిలా ఎగిరి పడే ఉత్సాహంతో ఉంటూనే పక్కా క్లారిటీ మెయిన్‌టెన్ చేస్తున్నారు. కూతురు ఎప్పుడూ నాన్న కూచే కదా! ‘ఏదైనా మంచి పని చేసే ముందు నాన్న నోరు తీపి చేసుకొమ్మన్నాడంటూ…’ చాలా సందర్భాల్లో డైరీమిల్క్ యాడ్‌ని రీషూట్ చేస్తున్నారు. కొంటె నవ్వులు… జంటగా తుళ్లింతలు. కాళ్లకు చక్రాలు కట్టుకుని కాలంపై యుద్ధం ప్రకటిస్తారు వీళ్లు. మేఘాలలో తేలిపొమ్మన్నది… అంటూ తుఫానులా దూసుకుపోతుంటారు.
ఇక్కడ బైక్ రైడ్ చేసేది అబ్బాయ్ అనుకునేరు.. అమ్మడే! వలయాల నిలయాలు అంటే వారికి అస్సలు పడవు. అందుకే జెన్ జీ యూత్ ప్రేమకి హద్దులుండవు. మనసులో ఏం దాచుకోరు. ఉదయం బస్‌స్టాప్‌లో స్టార్ట్ అయిన ప్రేమ సాయంత్రం ట్యూషన్లో ట్యూన్ అవుతుంది. ఎఫ్బీ వాల్‌పై గ్యాప్ లేకుండా పోస్ట్‌లు ఉంటాయి. ఇన్ స్టాలో రీల్స్ ఒకటే ప్లే అవుతాయ్. క్లాస్ రూంలో పాఠం వింటున్నప్పుడు… వారి కళ్లను చూస్తే వాట్ ఏ కాన్సన్ట్రేషన్ అనుకునేలా ఉన్నా, బెంచి కింద నుంచి ఊసులు తరంగాల్లా తిరుగుతుంటాయి. మునివేళ్లు మొబైల్ కీబోర్డుపై మెరుపు వేగంతో కదులుతుంటాయి. టైపింగ్‌లో హైయర్ … షార్ట్‌హ్యాండ్‌లో మాస్టర్ డిగ్రీ రెండూ తెలుసు వారికి. దగ్గరి నుంచీ చూస్తే, అమ్మో!! వీళ్లు మామూలు అమ్మళ్లు కాదని ఎవరైనా ముక్కుమీద వేలేసుకోవాల్సిందే!
తరచి చూస్తే అమ్మడి మాటల్లోనూ, మెసేజుల్లోనూ, రైడ్‌లో, కలిసి చేసే పనిలో… ఏం ఉంటుంది? అది ప్రేమేనా? కచ్చితంగా కాదు. లవ్ ఫీలింగ్ కూడా అస్సలు కాదు. పక్కన ఉంది ఎవరో?… లవరా? బాయ్ ఫ్రెండేమో?… అని మనం ఊహించుకుంటాం. క్లవర్స్గా ఫీలైపోతాం. కానీ అలా ఏం కాదు. కావాలంటే వాళ్ల ఫేస్బుక్ వాల్‌పై షేరింగ్‌లు, మొబైల్ మెసేజ్‌లను చూసినా సరే… హౌ ఆర్ యూ? వేర్ ఆర్ యూ? వాట్స్ అప్… లాంటి పొడి అక్షరాలే కనిస్తాయి. వాటి వెనక ఎలాంటి ఉద్దేశాలు ఉండవు.
కేవలం కమ్యూనికేషనే. వాళ్లెప్పుడూ ఒకే కూల్ డ్రింక్‌లో రెండు స్ట్రాలేసుకుని తాగరు. ఎందుకంటే వాళ్లు బేకరీకి వెళ్లేది భుజాలు రాసుకుంటూ కూర్చోవడానికి కాదు. పఫ్‌లు తింటూ ఫన్ చేయడానికి మాత్రమే. ఒకవేళ వాళ్లది ప్రేమనుకుని ఎవరైనా ప్రపోజల్ పెడితే.. . రెస్పాన్స్ రాష్‌గా ఉండదు. ‘లైట్ డ్యూడ్!’ అంటూ లైన్ మార్చేస్తారు. బహుశా వీరికి ద్వేషించడం కూడా తెలియదేమో! అందుకే, బెదిరింపు ప్రేమలు, భయపెట్టే ప్రేమలు… తమ దరిదాపుల్లోకి కూడా రాకుండా చూసుకుంటారు.
క్లాసులు మారుతూ… సెమిస్టర్ల మెట్లెక్కే క్రమంలో… ఎక్కడా జంకే ప్రసక్తే లేదు. చివరికి చదువుల క్యాంపస్ దాటి కొలువుల కాంపౌండ్‌లోకి అడుగుపెట్టినా అంతే చలాకీగా దూసుకెళ్తున్నారు. గట్టిగా మాట్లాడితే.. టీఎల్‌కే సెటైర్లు పడుతున్నాయ్. ఆన్‌టైమ్‌లో ప్రాజెక్టును ఫినిష్ చేయడమే కాదు… పార్టీకి కూడా ఆన్టైమ్లోనే వచ్చేస్తున్నారు. జిల్ జిల్ జిగా… అంటూ బాస్‌తో బిల్లు కట్టించి మరీ వెళ్తున్నారు. సో, ఈ క్రేజీ అమ్మళ్ల సందడి చూస్తుంటే కొలువుల మార్కెట్లో కూడా తమదే పై చేయిగా సాగిపోతున్నారు. రోమ్ లో ఉన్నప్పుడు రోమన్‌లా, ఇంట్లో ఉన్నప్పుడు ఇంటి బిడ్డగా… ఎక్కడికక్కడే ఈ జెన్ జీ అమ్మళ్లు.. జీవించేందుకు ఇష్టపడుతున్నారు. నేటి తరం లైఫ్ ైస్టెల్‌ని చెప్పకనే చెబుతున్నారు.