హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ) : అధికార కాంగ్రెస్‌ను (Congress) ఓటమి భయం వణికిస్తున్నది. జూబ్లీహిల్స్‌లో (Jubilee Hills) ఓడిపోతామనే భయంతో నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడుతున్నది. ప్రభుత్వ అధికారులు, పోలీసులను అడ్డం పెట్టుకుని అరాచకాలకు పాల్పడుతున్నది. ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కుతూ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నది. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న బీఆర్ఎస్ను అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నది. పోలింగ్‌కు సమయం దగ్గపడుతుండటంతో బీఆర్ఎస్ నిన్నమొన్నటి వరకు బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ అనుచరులు రౌడీయిజం చెలాయిస్తే.. ఇప్పుడు ప్రభుత్వ పెద్దలే అధికారులు, పోలీసులను అడ్డం పెట్టుకొని సోదాల పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారు.
తాజాగా కూకట్పల్లి నియోజకవర్గం మూసాపేట డివిజన్లో బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఇంట్లో డబ్బులు ఉన్నాయంటూ ఎలక్షన్ ఫ్లయింగ్ స్వాడ్ పేరిట కొందరు ఎలాంటి నోటీసులు లేకుండా తనిఖీలు చేశారు. యజమాని అనుమతి లేకుండా వందలాది మంది పోలీసుల పహారాలో ఇంట్లోకి చొరబడ్డారు. సామగ్రిని చిందరవందరగా పడేసి, ఇల్లంతా జల్లెడపట్టారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సోదాలు కొనసాగించారు. అడ్డుకున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులను బయటకు ఈడ్చిపడేశారు. ప్రభుత్వ పెద్దలు, అధికారులు, పోలీసుల వైఖరిని నిరసిస్తూ మర్రి జనార్దన్‌రెడ్డి, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు… అక్కడే ఇంటి ముందు బైఠాయించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్‌రెడ్డికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు, బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. గంటల తరబడి సోదాలు చేసినాఒక్క రూపాయి కూడా దొరకలేదు. అయినా రిపోర్ట్ ఫైల్ చేస్తున్నామనే సాకు చెప్తూ గం టలకొద్దీ అక్కడే ఉండీ ప్రచారానికి వెళ్లకుండా చేశారు.

ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం కోడ్ అమల్లో ఉన్న ప్రాంతంలోని ఇండ్లు, సంస్థల్లో నోటీసులు, ఫిర్యాదులు లేకున్నా ఎన్నికల అధికారులు సోదాలు నిర్వహించవచ్చు. కానీ కోడ్ వర్తించని ప్రాంతాల్లో తనిఖీలు చేయడానికి రాతపూర్వకమైన ఫిర్యాదు అందితే, ఇంటి యజమాని సమక్షంలో, యజమాని అనుమతితో సోదాలు చేయాల్సి ఉంటుంది. కానీ కూకట్పల్లి నియోజకవర్గంలోని మూసాపేట డివిజన్లోని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఇంట్లోకి.. ఎలాంటి రాతపూర్వక ఫిర్యాదులు లేకుండా.. యజమాని లేని సమయంలో తాళం వేసి ఉన్న ఇంట్లోకి చొరబడి సోదాలు చేశారు. ఇద్దరు ఎన్నికల అధికారులు, వందలాది మంది పోలీసుల బలగాలతో వచ్చి ఇంటి చుట్టూ మోహరించారు. సమాచారం తెలుసుకున్న మర్రి జనార్దన్‌రెడ్డి, ఆ ఇంట్లో ప్రస్తుతం అతిథిగా ఉంటున్న ఎమ్మెల్సీ రవీందర్రావు అక్కడికి చేరుకున్నారు. ఎవరి ఫిర్యాదుతో సోదాలు చేస్తున్నారు? ఇంట్లో యజమాని లే కుండా సోదాలు ఎలా చేస్తారు? అని అధికారులను ప్రశ్నించగా, అధికారుల నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. బీఆర్ఎస్ నేతలను పోలీసులు అక్కడి నుంచి బలవంతంగా లాక్కెళ్లారు. ఆగ్రహించిన బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అక్కడే ఇంటి ముందు బైఠాయించి, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

కాంగ్రెస్ నేతలకు ఓటమి భయం పట్టుకున్నది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలతోపాటు సామాన్య ప్రజలను వేధిస్తున్నారు. రహమత్‌నగర్‌లో ఓటర్లను మభ్యపెట్టి, డబ్బులు పంచేందుకు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను అక్కడ లేకుండా చేసేందుకు ఇండ్లలో సోదాల పేరిట డ్రామాకు తెరలేపారు. నిజంగానే అధికారులకు ఫిర్యాదు అందితే మాకు వివరాలు ఎందుకు చెప్పలేదు? ఓడిపోతున్నామని కాంగ్రెస్‌కు స్పష్టత వచ్చింది.
ఓటమి భయంతో సీఎం రేవంత్‌రెడ్డి వేసిన డైవర్షన్ ప్లాన్ బెడిసికొట్టిందని మాజీ ఎమ్మెల్యే ధాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా మా నేతలను ఇబ్బందులకు గురిచేసేందుకు సోదాల పేరిట డ్రామాలకు తెరతీశారని పేర్కొ న్నారు. బీఆర్ ఎస్ ప్రభంజనాన్ని అడ్డుకునేందుకే కాంగ్రెస్ ఇలాంటి చర్యలకు పూనుకుంటుందని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి విమ ర్శించారు. జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ గెలుస్తుందనే అక్కసుతోనే మా నేతలపై వేధింపులకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి అన్నారు. ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా బీఆర్ఎస్సే గెలు స్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఎన్నికల అధికారులు ఐదు గంటలపాటు మా ఇంట్లో సోదాలు నిర్వహించారు. తనిఖీలలో ఒక చెడ్డీ, ఒక బనియన్, ఒక టీషర్ట్ మాత్రమే దొరికాయి. కాంగ్రెస్ నేతలు ఓటమి భయంతోనే అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ.. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఎన్నికల అధికారులు ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు చేసిన సోదాల్లో ఒక్క రూపాయి దొరకలేదు. అయినా రిపోర్టుతో నెపంతో ఇంట్లో గంటల తరబడి, మమ్మల్ని ప్రచారానికి వెళ్లకుం డా అడ్డుకున్నారు. కాంగ్రెస్ నేతల దగ్గరే లక్షల కోట్ల రూపాయలున్నాయి.