KU Hostel | హనుమకొండ చౌరస్తా, జూన్ 28: కాకతీయ యూనివర్సిటీ (కేయూ) హాస్టల్ మెస్‌లో ఆదివారం ఉదయం విద్యార్థులకు అందించిన ఉప్మాలో పురుగులు కనిపించడం కలకలం రేపింది. టిఫిన్‌లో పురుగులు గుర్తించిన విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు.
హాస్టల్ మెస్‌లో నాణ్యమైన ఆహారం అందించడం లేదని కేయూ విద్యార్థులు ఆరోపించారు. గతంలోనూ భోజనంలో పురుగులు, ఇనుప మేకులు కనిపించిన విషయాన్ని గుర్తుచేశారు. మెస్‌లో నాణ్యమైన భోజనం పెట్టడం లేదని, ఉడికీఉడకని అన్నం, నీళ్లచారు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు జరుగుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని వాపోయారు. హాస్టల్ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్లకు పలుమార్లు ఫిర్యాదు చేసినా సమస్యలు పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మెస్ నిర్వహణలో సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. యూనివర్సిటీ మెస్‌లో నాన్ బార్డర్స్‌కు కూడా భోజనం అందిస్తున్నారని.. దీనివల్ల హాస్టల్ విద్యార్థులకు సరిపడా ఆహారం అందించడం లేదని అన్నారు. వెంటనే మెస్ నిర్వహణలో మార్పులు చేసి, నాణ్యమైన, పరిశుభ్రమైన భోజనాన్ని అందించాలని డిమాండ్ చేశారు.