శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్ నౌషెరా సెక్టార్లో నియంత్రణ రేఖ వెంట చొరబాటు ప్రయత్నాలను సైన్యం విఫలం చేసింది. భారత్లోకి చొరబడేందుకు యత్నించిన ఇద్దరిని భద్రతా బలగాలు హతమార్చాయి. ఆ తర్వాత సెర్చ్ ఆపరేషన్లో చొరబాటుదారులిద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. నౌషేరా సెక్టార్లోని నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నిస్తున్నట్లు అందిన సమాచార మేరకు.. సైన్యం సకాలంలో స్పందించి చొరబాటును అడ్డుకున్నది. నౌషెరా సెక్టార్లో ఇండో-పాకిస్తాన్ నియంత్రణ రేఖ వద్ద చొరబాటుదారున్ని బలగాలు అదుపులోకి తీసుకున్నాయి.