జైపూర్: పోలీసులు ఒక ఇంటిపై రైడ్ చేశారు. ఈ సందర్భంగా మంచంపై తల్లి పక్కన నిద్రిస్తున్న నెల వయస్సున్న శిశువును పోలీసులు కాలితో తొక్కినట్లు ఆ కుటుంబం ఆరోపించింది. (Infant Dies During Raid) దీంతో ఆ శిశువు మరణించినట్లు ఫిర్యాదు చేశారు. బిడ్డ మృతికి కారణమైన ఇద్దరు పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజస్థాన్లోని అల్వార్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సైబర్ మోసం కేసులో నిందితుడ్ని అదుపులోకి తీసుకునేందుకు శనివారం నౌగావాన్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ఒక ఇంటికి పోలీసులు వెళ్లారు.
కాగా, రైడ్ సందర్భంగా మంచంపై తల్లి పక్కన నిద్రిస్తున్న నెల వయస్సున్న పసి పాప అలిస్బాను పోలీసులు కాలితో తొక్కినట్లు ఆ కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో గాయపడిన చిన్నారి మరణించినట్లు ఫిర్యాదు చేశారు. తల్లి జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు ఆమెను ఇంటి నుంచి బయటకు నెట్టివేశారని ఆరోపించారు. ఇంట్లో తనిఖీ సమయంలో మహిళా పోలీసులు ఎవరూ లేరని ఫిర్యాదులో పేర్కొన్నారు.
మరోవైపు పోలీసుల నిర్లక్ష్యం వల్ల నెల వయస్సున్న శిశువు మరణించడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం అల్వార్ ఎస్పీ నివాసం వద్ద నిరసన వ్యక్తం చేశారు. నిందితులైన ఇద్దరు పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్పీ వెల్లడించారు.