హనుమకొండ చౌరస్తా, మార్చి 27: ఇండస్ట్రీ అకాడమియా ఇన్నోవేషన్ కాన్ క్లేవ్ మూడో ఎడిషన్ శుక్రవారం నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)లోని అంబేద్కర్ లెర్నింగ్ సెంటర్లో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్డ్ రీసెర్చ్ అండ్ ఇండస్ట్రియల్ కన్సల్టెన్సీ విభాగం, సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఇన్క్యుబేషన్తో కలిసి, పరిశ్రమ-అకాడమియా అనుసంధానాన్ని బలోపేతం చేయడానికి చేపట్టినట్లు నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుధి తెలిపారు. ఈ కాన్క్లేవ్లో పరిశ్రమ, అకాడమియా, పరిశోధనా సంస్థల ప్రముఖులు పాల్గొని, పరస్పర సహకారాన్ని మరింతగా పెంపొందించడం, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి వేగవంతం చేయడం, ఆవిష్కరణల ఆధారిత అభివృద్ధిని ప్రోత్సహించడం వంటి అంశాలపై చర్చించినట్లు చెప్పారు.
సాంకేతిక సెషన్లు, ప్యానెల్ చర్చలు, స్టార్టప్ ప్రదర్శనలు టెక్నాలజీ స్టాల్స్ ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని, ఇవి అత్యాధునిక ఆవిష్కరణలను ప్రదర్శించడానికి, పరస్పర సంభాషణలకు ఉత్తమ వేదికగా నిలిచినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య ఆకర్షణగా, సంస్థ కమ్యూనికేషన్, అవుట్ రీచ్ సామర్థ్యాలను మెరుగుపరచడానికి ఉపయోగపడే అత్యాధునిక ఎల్ఈడి బోర్డ్‌ను ప్రారంభించారు. అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ సీఈఓ డాక్టర్ శివకుమార్ కల్యాణరామన్ ఆన్లైన్ ద్వారా కీలక ప్రసంగం అందించారు.