ముంబై : వ్యాపారవేత్త అనిల్ అంబానీని ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించింది. ఫారిన్ ఎక్స్చేంజ్ ఉల్లంఘన కేసులో ఈడీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఫెమా కేసు విషయంలో ఈడీ ముందు అనిల్ అంబానీ హాజరైనట్లు మీడియా పేర్కొన్నది. 1999లో ఫెమా కేసు నమోదు చేశారు. ముంబైలోని ఈడీ ఆఫీసుకు ఆయన ఉదయం 10 గంటలకు చేరుకున్నట్లు తెలిసింది. వాంగ్మూలం ఇచ్చిన తర్వాత ఆయన ఆఫీసు నుంచి వెళ్లిపోయారు.
గతంలో 2020లో ఈడీ ఆఫీసు ముందు మనీల్యాండరింగ్ కేసులో రిలయన్స్ గ్రూపు చైర్మెన్ అనిల్ అంబానీ హాజరయ్యారు. ఎస్ బ్యాంక్ ప్రమోటర్ రాణా కపూర్‌తో పాటు ఇతరుల్ని కూడా ఈడీ ప్రశ్నించింది. గత ఏడాది ఆగస్టులో ఆదాయపన్ను శాఖ అంబానీకి నోటీసులు ఇచ్చింది. సుమారు 420 కోట్ల మేర పన్ను ఎగవేసినట్లు అనిల్ అంబానీపై ఆరోపణలు ఉన్నాయి. రెండు స్విస్ బ్యాంకుల్లో ఉన్న 814 కోట్ల నిధులకు చెందిన పన్నులు చెల్లించలేదని ఆరోపణలు ఉన్నాయి. మార్చి నెలలో ఐటీ శాఖ ఇచ్చిన షోకాజ్ నోటీసులపై బాంబే హైకోర్టు తాత్కాలిక స్టే ఆర్డర్ ఇచ్చింది.