ముంబై, ఏప్రిల్ 28: వరుసగా రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన సూచీలు కదంతొక్కాయి. భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతోపాటు బ్లూచిప్ సంస్థల షేర్లతోపాటు ప్రైవేట్ బ్యాంకులు, విదేశీ మదుపరులు భారీగా నిధులు కుమ్మరించడంతో సెన్సెక్స్ 80 వేల పాయింట్లను మళ్లీ తచ్చాడింది. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 1,005.84 పాయింట్లు లేదా 1.27 శాతం ఎగబాకి 80,218.37 వద్ద ముగిసింది. మరో సూచీ నిఫ్టీ 289.15 పాయింట్లు(1.20 శాతం) అందుకొని 24,328.50 వద్ద స్థిరపడింది. ఐటీ రంగ షేర్లు భారీగా నష్టపోయినప్పటికీ ఫార్మా, ఎనర్జీ, వాహన రంగ షేర్లకు లభించిన మద్దతుతో సూచీలు కోలుకున్నాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి. దేశీయ కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అత్యధికంగా 5.27 శాతం ఎగబాకి టాప్ గెయినర్‌గా నిలిచింది.