వర్జీనియా: అమెరికాలోని నార్తర్న్ వర్జీనియాలో డ్రగ్స్ అమ్ముతూ, వ్యభిచార ముఠా నిర్వహిస్తున్న భారతీయ సంతతి జంట(Indian American couple)ను అరెస్టు చేశారు. తమ స్వంత హోటల్లో ఈ కార్యకలాపాలకు పాల్పడినట్లు కోర్టు డాక్యుమెంట్లలో పేర్కొన్నారు. ఈ కేసులో కోశా శర్మ, ఆమె భర్త తరుణ్ శర్మపై అభియోగాలు నమోదు చేశారు. డమ్ఫ్రైస్లోని రెడ్ కార్పెట్ ఇన్‌లో డ్రగ్స్ అమ్మినట్లు, వ్యభిచారం నిర్వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. కోశా ఎల్ఎల్సీ ద్వారా ఆ మోటల్‌ను నిర్వహించినట్లు తెలుస్తోంది. తమ ప్రమేయంతోనే దందా నిర్వహించారని, దాని ద్వారా ఆర్థిక లాభాలు పొందారని ఆరోపణలు ఉన్నాయి.
2023 మే నుంచి రెడ్ కార్పెట్ ఇన్ను శర్మ దంపతులు లీజ్‌కు తీసుకుని నడిపినట్లు తెలుస్తోంది. డ్రగ్ సేల్స్, వ్యభిచార ముఠా ద్వారా వచ్చిన లాభాల్లో వాటా తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కేవలం లాడ్జింగ్ సౌకర్యం మాత్రమే కల్పించే మోటల్ ద్వారా దందా సాగినట్లు తెలుస్తోంది. ఫెంటనిల్ లాంటి మాదకద్రవ్యాలు అమ్మినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎఫ్బీఐతో పాటు ప్రిన్స్ విలియమ్ కౌంటీ పోలీసు శాఖ, వర్జీనియా పోలీసు శాఖ ఈ కేసులో సంయుక్తంగా దర్యాప్తు చేపట్టింది.