Hockey Asia Cup : స్వదేశంలో జరుగుతున్న హాకీ ఆసియా కప్‌లో భారత జట్టు (Team India) ఫైనల్‌కు దూసుకెళ్లింది. లీగ్ దశలో దుమ్మురేపిన టీమిండియా.. సూపర్ 4 మ్యాచ్‌లోనూ అదే జోరు చూపించి చైనాకు చెక్ పెట్టింది. శనివారం జరిగిన ఏకపక్ష పోరులో ప్రత్యర్థిని 7-0తో చిత్తుగా ఓడించింది. భారీ విజయంతో హర్మన్‌ప్రీత్ సింగ్ సేన దర్జాగా ఫైనల్లో అడుగుపెట్టింది. నాలుగో ఆసియా కప్ టైటిల్ కోసం దక్షిణకొరియా (South Korea)తో టీమిండియా తలపడనుంది.
బిహార్‌లోని రాజ్‌గిర్ వేదికగా జరుగుతున్న ఆసియా కప్‌లో భారత జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. తొలి రెండు మ్యాచుల్లో స్వల్ప తేడాతో విజయం సాధించిన టీమిండియా సూపర్ 4లో మాత్రం ఓ రేంజ్లో చెలరేగింది. మలేషియాపై గోల్స్ వర్షం కురిపించి17-0తో జయభేరి మోగించిన హర్మన్‌ప్రీత్ సేన చైనాను కూడా చిత్తు చేసింది. అన్ని విభాగాల్లోనూ సమిష్టిగా రాణించిన భారత జట్టు.. ప్రత్యర్థి డిఫెన్స్‌ను కకావికలం చేసింది.
𝐈𝐧𝐝𝐢𝐚 𝐭𝐡𝐫𝐚𝐬𝐡 𝐂𝐡𝐢𝐧𝐚 𝟕-𝟎 in the final Super 4 match at Rajgir, storming into the final of the 𝐌𝐞𝐧’𝐬 𝐀𝐬𝐢𝐚 𝐂𝐮𝐩 𝐇𝐨𝐜𝐤𝐞𝐲 𝐂𝐡𝐚𝐦𝐩𝐢𝐨𝐧𝐬𝐡𝐢𝐩 in Bihar#HockeyIndia #IndiaKaGame #HumseHaiHockey pic.twitter.com/dxpc47HGD1
— All India Radio News (@airnewsalerts) September 6, 2025
తొలి అర్థ భాగంలోనే శిలానంద్ లక్రా, దిల్‌ప్రీత్ సింగ్, మన్దీప్ సింగ్ తలా ఒక గోల్ చేయడంతో 3-0తో ఆధిక్యం సాధించింది. రెండో అర్ధ భాగంలో రాజ్‌కుమార్ పాల్, సుఖ్జీత్ సింగ్ చెరొక గోల్ చేసి చైనాపై ఒత్తిడి పెంచారు. దాంతో.. ప్రత్యర్థి జట్టు సభ్యులు గోల్ చేసేందుకు సర్వశక్తులు ఒడ్డారు. కానీ.. ఆఖర్లో అభిషేక్ నైన్ రెండు గోల్స్ కొట్టి భారత్ ఆధిక్యాన్ని 7-0కు పెంచాడు. దాంతో.. హర్మన్‌ప్రీత్ సేన నాలుగో టైటిల్ వేటకు సిద్ధమైంది.