SL vs ZIM : అంతర్జాతీయ టీ20ల్లో శ్రీలంక(Srilanka)కు భారీ షాక్. ఆసియా కప్ ముంగిట జింబాబ్వే (Zimbabwe) చేతిలో లంక చిత్తుగా ఓడిపోయింది. హరారేలో జరిగిన రెండో టీ20లో 80 పరుగులకే ఆలౌటైన చరిత అసలంక బృందం.. స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. ఛేదనలో జింబాబ్వే ఓపెనర్లు బ్రియాన్ బెన్నెట్(19), తడివనషె మరుమణి(17) శుభారంభమివ్వగా.. ఆఖర్లో తషింగ ముసెక్వివా(21 నాటౌట్), రియాన్ బురి(20 నాటౌట్) రాణించి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. విజయానికి ఐదు పరుగులు అవసరమైన వేళ ముసెక్వివా వరుసగా రెండు బౌండరీలు బాదడంతో 5 వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్ సమం చేసింది జింబాబ్వే.
స్వదేశంలో.. ముఖ్యంగా పొట్టి ఫార్మాట్లో తామెంత ప్రమాదకరమో జింబాబ్వే మరోసారి నిరూపించింది. తొలి టీ20లో శ్రీలంకకు షాకిస్తూ విజయానికి చేరువైన జింబాబ్వే.. కొద్దిలో ఓడిపోయింది. అయితే.. రెండో మ్యాచ్‌లో మాత్రం ఆల్‌రౌండ్ షోతో లంకను మట్టికరిపించింది సికిందర్ రజా బృందం. మొదట బ్యాటింగ్ చేసిన లంకన జింబాబ్వే బౌలర్లు కోలుకోలేని దెబ్బతీశారు. కెప్టెన్ సికిందర్ రజా(3-11), పేసర్ బ్రాడ్ ఎవాన్స్(3-15) తలా మూడేసీ వికెట్లతో పర్యాటక జట్టు నడ్డి విరిచారు. కమిల్ మిషర(20), సారథి చరిత అసలంక(18), దసున్ షనక (15) మాత్రమే రెండంకెల స్కోర్ చేయగా… లంక 17.4 ఓవర్లలో 80 పరుగులకే ఆలౌటయ్యింది.
Sri Lanka bowled out within 18 overs 🎯
Follow live: https://t.co/Cd697JCLPR pic.twitter.com/SvHznJyKks
— ESPNcricinfo (@ESPNcricinfo) September 6, 2025
అనంతరం ఛేదనలో ఓపెనర్లు లంక పేసర్లను కాచుకొని శుభారంభం ఇచ్చారు. ఆ తర్వాత దుష్మంత చమీర (3-19) విజృంభణతో సీన్ విలియమ్స్ (0), సికిందర్ రజా(2) స్వల్ప స్కోర్‌కే ఔటయ్యారు. కీలక వికెట్లు పడినా బెన్నెట్ పట్టువిడువలేదు. జట్టు స్కోర్ 50 దాటించిన అతడిని ఫెర్నాండో ఔట్ చేసి ఒత్తిడి పెంచాడు. కానీ.. రియాన్ బురి(20 నాటౌట్), తషింగ ముసెక్వివా(21 నాటౌట్)లు కంగారుపడకుండా ఆడారు. హేమంత వేసిన 15వ ఓవర్లో ముసెక్వివా తొలి రెండు బంతుల్ని ఫోర్లుగా మలిచాడు. దాంతో.. 5 వికెట్ల తేడాతో జింబాబ్వే విజయం సాధించి సిరీస్ సమం చేసింది. లంకను కూల్చడంలో కీలకమైన రజా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇరుజట్ల నిర్ణయాత్మక మూడో మ్యాచ్ సెప్టెంబర్ 7న జరుగనుంది.