కట్టంగూర్, సెప్టెంబర్ 06 : కుటుంబ కలహాల నేపథ్యంలో ఉరి వేసుకుని మహిళ మృతి చెందిన సంఘటన కట్టంగూర్ మండల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. ఎస్ఐ మునుగోటి రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. రామన్నపేట మండలం కక్కిరేణి గ్రామానికి చెందిన పోలగోని యాదయ్య తన చిన్న కుమార్తె లక్ష్మి(35)ని 16 సంవత్సరాల క్రితం కట్టంగూర్కు చెందిన పెద్ది యాదయ్య పెద్ద కుమారుడు సైదులుకు ఇచ్చి వివాహం చేశాడు. ఈ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. గతకొంత కాలంగా భర్త సైదులు తాగుడుకు బానిపై కుటుంబాన్ని పట్టించుకోవడం లేదు.
తాగుడు మాని కుటుంబాన్ని పోషించుకోవాలని పలుమార్లు పెద్ద మనుషులతో చెప్పించినా అతడు మారలేదు. దీంతో జీవితం మీద విరక్తి చెందిన లక్ష్మి శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇనుప రాడుకు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన భర్త సైదులు చుట్టుపక్కల వారి సహాయంతో నల్లగొండ ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లాడు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారు. మృతురాలి తల్లి జయమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు.