న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించారన్న ఆగ్రహంతో మన పొరుగు దేశమైన నేపాల్‌లో చెలరేగుతున్న జన్-జడ్ నిరసనలను భారత్ నిశితంగా పరిశీలిస్తున్నది. నిరసనకారులు ఆ దేశ పార్లమెంట్, అధ్యక్షుడు, ప్రధాని ప్రైవేట్ నివాసాలతో పాటు సుప్రీం కోర్టుకు సైతం నిప్పెట్టారు. కాగా, గత ఐదు సంవత్సరాలుగా మన పొరుగున ఉన్న దేశాల్లో ప్రజాందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఇప్పుడు నేపాల్ దేశాల్లో తీవ్ర రాజకీయ అస్థిర, అశాంతి పరిస్థితులు ఏర్పడ్డాయి.
తద్వారా ప్రజాందోళనలకు కొన్ని దేశాల్లో ప్రభుత్వాలు కూలిపోగా, దేశాధినేతలు విదేశాలకు పరారయ్యారు. మన పొరుగున్న ఉన్న ఒక దేశంలో ఇబ్బంది ఏర్పడితే అది మొత్తం దక్షిణాసియా స్థిరత్వాన్ని ప్రభావితం చేస్తుంది. దానికి భారత్ మినహాయింపు కాదు. పొరుగు దేశంలో కల్లోలం ఏర్పడితే అది భారత్ భద్రత, సామాజిక, ఆర్థిక, విదేశాంగ పరంగా ప్రభావం చూపుతుంది. ఇటీవల ఐదేండ్ల కాలంలో మన పొరుగున ఉన్న దేశాలలో ఏర్పడిన రాజకీయ అనిశ్చితి పరిస్థితుల గురించి చూద్దాం.
శ్రీలంక: మన పొరుగున ఉన్న మరో దేశం శ్రీలంకలో కూడా 2022లో ఇలాంటి రాజకీయ అస్థిర పరిస్థితులతో భారీ హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోవడంతో దేశంలో తీవ్ర ప్రజాందోళనలు వ్యక్తం అయ్యాయి. ముఖ్యంగా దేశంలో ఏర్పడిన తీవ్ర నిరుద్యోగం, ఆహారం, మందుల కొరత దేశ మధ్య తరగతి ప్రజలను తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. దీంతో వారు ఏకంగా అధ్యక్షుడి ప్యాలెస్‌పైకి దూసుకొచ్చారు. అక్కడి వస్తువులను లూటీ చేశారు. కొలంబోలోని ప్రధాని నివాసానికి కూడా నిప్పంటించారు. ప్రజాగ్రహాన్ని తట్టుకోలేక అప్పటి అధ్యక్షుడు 73 ఏండ్ల గొంటబయ రాజపక్స జూలై 13న తన భార్య, ఇద్దరు సెక్యూరిటీ అధికారులతో మాల్దీవులకు పారిపోయారు. తర్వాత జరిగిన ఎన్నికలలో ఎన్పీపీకి చెందిన అనుర కుమార దిసనాయకె అధ్యక్షుడిగా, హరిణి అమరసూరియా ప్రధానిగా ఎన్నికయ్యారు.
బంగ్లాదేశ్: ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా విధానాన్ని ప్రవేశపెట్టిన బంగ్లాదేశ్ అధ్యక్షురాలు షేక్ హసీనా చర్యపై యువత, విద్యార్థులు తీవ్రంగా మండిపడ్డారు. హసీనాకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనను అణచివేసేందుకు ఆమె చేసిన ప్రయత్నాలలో 300 మంది మరణించారు. తర్వాత ఆందోళనకారుల పట్ల ప్రభుత్వ బలగాలు క్రూర విధానాలు అవలంబించడంతో వారు ఈసారి ఏకంగా హసీనా ప్రభుత్వాన్నే లక్ష్యంగా చేసుకున్నారు. వారి నిరసనలకు తలొగ్గి హసీనా ప్రభుత్వం కోటా వ్యవస్థను తగ్గించినప్పటికీ వారి ఆందోళన నెలల పాటు సాగింది.
ఈ క్రమంలో అనేక హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. 2024 ఆగస్టు 5న జరిగిన నాటకీయ పరిణామాల్లో వేలాది మంది ఆందోళనకారులు హసీనా అధికార గృహంపైకి దండెత్తారు. దీంతో ఆమె ప్రత్యేక విమానంలో భారత్‌కు పారిపోయారు. తర్వాత నోబెల్ బహుమతి గ్రహీత యూనస్ ఇన్చార్జిగా బంగ్లాదేశ్‌లో తాత్కాలిక పాలన కొనసాగుతున్నది. పరిస్థితులు చక్కబడిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలు నిర్వహిస్తామని ఆ దేశ ఆర్మీ ప్రకటించింది.
అఫ్గానిస్థాన్: అఫ్గానిస్థాన్ మన పొరుగు దేశం కాకపోయినప్పటికీ ఉపఖండ విస్తృత భౌగోళిక రాజకీయ చిత్రంలో ఆ దేశం కీలక పాత్ర పోషిస్తున్నది. పౌరులను వారి కర్మకు వారిని వదిలేసి 2021, ఆగస్టు 15న అమెరికా బలగాలు దేశాన్ని వదిలిపోవడంతో రాజధాని కాబుల్‌ను తాలిబన్లు తిరిగి చేజక్కించుకున్నారు. తన ప్రజలను విడిచిపెట్టబోనని అప్పటిదాకా ప్రకటించిన అధ్యక్షుడు ఆష్రఫ్ ఘనీ.. తాలిబన్లు రాజధానిని చుట్టుముట్టడంతో దేశం విడిచి పారిపోయారు.
తాలిబన్ సహ కమాండర్ ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ వేగంగా దేశాన్ని స్వాధీనం చేసుకుని తాలిబన్ ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్గానిస్థాన్‌ను ప్రకటించారు. న్యూఢిల్లీ అధికారికంగా తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించనప్పటికీ కాబుల్‌తో సంబంధాలు పెట్టుకున్న సందర్భాలున్నాయి. తాలిబన్లు అధికారం చేపట్టిన తర్వాత వారు విధించిన ఆంక్షలతో ఆ దేశంలో మహిళల పరిస్థితి పూర్తిగా దిగజారింది.
పాకిస్థాన్: వివాదాస్పదమైన అవిశ్వాస తీర్మానంతో ఇమ్రాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) విశ్వాసం కోల్పోవడంతో అప్పటివరకు ప్రధాని పదవిలో ఉన్న ఇమ్రాన్ ఖాన్‌ను 2022 ఏప్రిల్ 10న పదవి నుంచి దించేశారు. 342 మంది సభ్యులున్న నేషనల్ అసెంబ్లీలో విపక్షాలు 174 ఓట్లు సాధించాయి. పాకిస్థాన్ ఆర్మీ వెనుక ఉండి ఇదంతా చేసిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.
తర్వాత షెహబాజ్ షరీఫ్ ప్రధాని పీఠం ఎక్కారు. కాగా, తనపై పెట్టిన అవిశ్వాస తీర్మానం ఒక అంతర్జాతీయ కుట్ర అని, ఆర్మీతో చేతులు కలిపిన అగ్రరాజ్యం అమెరికా ఈ కుట్రకు పాల్పడిందని ఇమ్రాన్ ఖాన్ పలుసార్లు ఆరోపించారు. దీనిపై ఆ పార్టీ వారు ఆందోళనలు జరిపినా సమర్థంగా అణచివేశారు. కాగా, 2024, మార్చి 3న షెహబాజ్ షరీఫ్ రెండోసారి ప్రధానిగా అధికారంలోకి వచ్చారు. అయితే పేరుకి షెహబాజ్ ప్రధాని అయినప్పటికీ అధికారమంతా పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్దేనన్నది బహిరంగ రహస్యం.