చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా.. నాకౌట్ అవకాశాలు సన్నగిల్లాక టీమ్ఇండియా సమిష్టిగా సత్తాచాటింది. రోహిత్ శర్మ, లోకేశ్ రాహుల్ వేసిన అద్భుత పునాదిపై.. హార్డ్ హిట్టర్లు హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ భారీ పరుగుల సౌధాన్ని నిర్మించగా.. బౌలర్లు బాధ్యతాయుత ప్రదర్శనతో టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు తొలి విజయాన్నందించారు!
గత రెండు మ్యాచ్‌ల్లో పరాజయాలు ఎదురవడంతో నీరసపడ్డ కోహ్లీసేనకు ఈ విజయం కాస్త ఊరటనివ్వగా.. పండుగపూట అభిమానుల మోమొల్లో నవ్వుల కాంతులు పూయించింది. ఎట్టకేలకు పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచిన టీమ్ఇండియా రన్‌రేట్‌ను మెరుగు పర్చుకొని గ్రూప్-2లో నాలుగోస్థానానికి ఎగబాకింది!
అబుదాబి: నాకౌట్ రేసులో నిలువాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమ్ఇండియా విజృంభించింది. టాపార్డర్ దంచుడుకు.. బౌలర్ల సహకారం తోడవడంతో సూపర్-12లో భాగంగా బుధవారం జరిగిన పోరులో భారత్ 66 పరుగుల తేడాతో అఫ్గానిస్థాన్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (47 బంతుల్లో 74; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (48 బంతుల్లో 69; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకాలతో ఆకట్టుకోగా.. హార్దిక్ పాండ్యా (13 బంతుల్లో 35 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), రిషబ్ పంత్ (13 బంతుల్లో 27; ఒక ఫోర్, 3 సిక్సర్లు) ఆఖర్లో ఆకాశమే హద్దుగా చెలరేగారు. అఫ్గాన్ బౌలర్లలో నైబ్, కరీం చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో అఫ్గానిస్థాన్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 144 పరుగులకు పరిమితమైంది. కెప్టెన్ మహమ్మద్ నబీ (35), కరీం జనత్ (22 బంతుల్లో 42 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కాస్త పోరాడారు. నాలుగేండ్ల విరామం తర్వాత టీ20 జట్టులో చోటు దక్కించుకున్న భారత సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పొదుపుగా బౌలింగ్ చేసి 2 వికెట్లు పడగొట్టగా.. మహమ్మద్ షమీ మూడు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. రోహిత్‌శర్మకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇక శుక్రవారం జరుగనున్న తదుపరి మ్యాచ్‌లో స్కాట్లాండ్తో భారత్ తలపడనుంది.
గత రెండు మ్యాచ్‌ల్లో పేలవ ప్రదర్శనతో ఇంటా బయట విమర్శలు ఎదుర్కొంటున్న టాపార్డర్ ఈ సారి కలిసికట్టుగా కదంతొక్కింది. షర్ఫుద్దీన్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లో రోహిత్ ఓ ఫోర్.. రాహుల్ 6,4 బాదడంతో మొదలైన మనవాళ్ల దంచుడు చివరి ఓవర్ వరకు అలాగే కొనసాగింది. మంచి బంతులను గౌరవిస్తూనే.. చెత్త బంతులను బౌండ్రీలకు తరలించిన భారత ఓపెనర్లు ఏ దశలోనూ రన్‌రేట్ తగ్గకుండా చూసుకున్నారు. ఈ టోర్నీలో ప్రమాదకర బౌలర్‌గా మారిన నవీన్‌కు రోహిత్ చుక్కలు చూపాడు. అతడు వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో రోహిత్ 4,6,4 అరుసుకోవడంతో ఐదు ఓవర్లు ముగిసేసరికి టీమ్ఇండియా 52/0తో నిలిచింది. స్పిన్నర్ల రంగప్రవేశంతో పరుగుల రాక కాస్త నెమ్మదించినా.. ఈ జోడీ వీలుచిక్కినప్పుడల్లా భారీ షాట్లతో ప్రత్యర్థిపై ఆధిపత్యం కొనసాగించింది. ఈ క్రమంలో రోహిత్ 36 బంతుల్లో హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకుంటే.. రాహుల్ 35 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ చేరుకున్నాడు. రషీద్ ఖాన్ ఓవర్లో రెండు భారీ సిక్సర్లతో వేగం పెంచిన రోహిత్‌ను పార్ట్ టైమ్ బౌలర్ కరీం జనత్ బుట్టలో వేసుకున్నాడు. దీంతో 140 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. వన్‌డౌన్‌లో విరాట్ కోహ్లీకి బదులు రిషబ్ పంత్ క్రీజులో అడుగుపెట్టగా.. కాసేపటికే రాహుల్ కూడా వెనుదిరిగాడు. నిలదొక్కుకున్న ఆటగాళ్లు ఔటవడంతో భారత్ ఓ మోస్తరు స్కోరుకే పరిమితమౌతుందనుకుంటున్న తరుణంలో హార్దిక్, పంత్ విధ్వంసం సృష్టించారు.
21 బంతుల్లో 63 పరుగులు.. (బాక్స్) బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ పొందిన హిట్టర్లిద్దరూ అఫ్గాన్ పాలిట సింహస్వప్నాలుగా నిలువడంతో భారత్ భారీ స్కోరు చేయగలిగింది. నైబ్ ఓవర్లో పంత్ రెండు సిక్సర్లు అరుసుకుంటే.. హమీద్ వేసిన 18వ ఓవర్లో హార్దిక్ 4,4,4 కొట్టి అభిమానులను అలరించాడు. 19వ ఓవర్లో హార్దిక్ రెండు సిక్సర్లు బాదితే.. ఆఖరి ఓవర్లో పంత్ 4,6తో లెక్క సరిచేశాడు. ఈ ఇద్దరి ధాటికి చివరి 21 బంతుల్లో టీమ్ఇండియా 63 రన్స్ రాబట్టడం విశేషం. పాకిస్థాన్‌తో పోరులో గెలిచేంత పనిచేసిన అఫ్గానిస్థాన్.. ఈ మ్యాచ్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.
భారీ లక్ష్యఛేదనలో అఫ్గానిస్థాన్‌కు శుభారంభం దక్కలేదు. షమీ వేసిన ఓడో ఓవర్ చివరి బంతికి ఖాతా తెరువకుండానే మహమ్మద్ షహజాద్ (0) పెవిలియన్ చేరాడు. తదుపరి ఓవర్ తొలి బంతికే మరో ఓపెనర్ హజ్రతుల్లా జజాయ్ (13)ను బుమ్రా బుట్టలో వేసుకున్నాడు. కాసేపు పోరాడిన రహ్మానుల్లా (19)ను జడేజా ఔట్ చేయగా.. చాన్నాళ్ల తర్వాత తుదిజట్టులోకి వచ్చిన అశ్విన్ పొదుపుగా బౌలింగ్ చేశాడు. చక్కటి బంతితో గుల్బదీన్ నైబ్ (18)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న అశ్విన్.. నజీబుల్లా జద్రాన్ (11) క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆఖర్లో నబీ, కరీం జనత్ పోరాటం ఓటమి అంతరాన్ని తగ్గించేందుకే పరిమితమైంది.
గత రెండు మ్యాచ్‌ల్లో టాస్ ఓడిపోయి.. ఆనక మ్యాచ్‌లను చేజార్చుకున్న విరాట్ కోహ్లీకి ఈ సారి కూడా అది కలిసిరాలేదు. టాస్ గెలిచిన అఫ్గాన్ కెప్టెన్ మహమ్మద్ నబీ.. టీమ్ఇండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించగా.. ఈసారి టాపార్డర్ సత్తాచాటింది. దుబాయ్‌తో పోల్చుకుంటే.. బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న అబుదాబి పిచ్‌పై మనవాళ్లు వీర లెవల్లో విజృంభించారు.
భారత్: రాహుల్ (బి) నైబ్ 69, రోహిత్ (సి) నైబ్ (బి) కరీం 74, పంత్ (నాటౌట్) 27, హార్దిక్ (నాటౌట్) 35, ఎక్స్‌ట్రాలు: 5, మొత్తం: 20 ఓవర్లలో 210/2. వికెట్ల పతనం: 1-140, 2-147, బౌలింగ్: నబీ 1-0-7-0, షర్ఫుద్దీన్ 2-0-25-0, నవీన్ 4-0-59-0, హమీద్ 4-0-34-0, నైబ్ 4-0-39-1, రషీద్ 4-0-36-0, కరీం 1-0-7-1.
అఫ్గానిస్థాన్: హజ్రతుల్లా (సి) శార్దూల్ (బి) బుమ్రా 13, షహజాద్ (సి) అశ్విన్ (బి) షమీ 0, రహ్మానుల్లా (సి) హార్దిక్ (బి) జడేజా 19, నైబ్ (ఎల్బీ) అశ్విన్ 18, నజీబుల్లా (బి) అశ్విన్ 11, నబీ (సి) జడేజా (బి) షమీ 35, కరీం (నాటౌట్) 42, రషీద్ (సి) హార్దిక్ (బి) షమీ 0, షర్ఫుద్దీన్ (నాటౌట్) 2, ఎక్స్‌ట్రాలు: 4, మొత్తం: 20 ఓవర్లలో 144/7. వికెట్ల పతనం: 1-13, 2-13, 3-48, 4-59, 5-69, 6-126, 7-127, బౌలింగ్: షమీ 4-0-32-3, బుమ్రా 4-0-25-1, హార్దిక్ 2-0-23-0, జడేజా 3-0-19-1, అశ్విన్ 4-0-14-2, శార్దూల్ 3-0-31-0.