వెటరన్ పేసర్ మహమ్మద్ షమీ మరోసారి తను ఎంత విలువైన బౌలరో నిరూపించాడు. వికెట్ల కోసం భారత బౌలింగ్ దళం ఇబ్బంది పడుతున్న సమయంలో ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టాడు. సఫారీల ఇన్నింగ్స్ 56వ ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన షమీకి.. టెంబా బవుమా బౌండరీతో స్వాగతం పలికాడు. ఆ ఓవర్ తొలి బంతికే ఫోర్ కొట్టాడు.
అయితే ఆ తర్వాతి బంతికే బవుమాను షమీ పెవిలియన్ చేర్చాడు. బౌలింగ్ లెంగ్త్‌లో చిన్న వేరియేషన్ చూపించడంతో బవుమా కొద్దిగా తడబడ్డాడు. దీంతో అవుట్ సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతి సెకండ్ స్లిప్‌లో ఉన్న కోహ్లీ వైపుగా వెళ్లింది. అయితే ఇప్పటికే చాలా సార్లు ఎడ్జ్ తీసుకున్న బంతి ఫీల్డర్ వరకూ వెళ్లకపోవడం వల్ల కొన్ని అవకాశాలు పోయాయి.
ఇది కూడా అలాగే అవుతుందని అనిపించింది. కానీ కోహ్లీ చాలా వేగంగా రియాక్ట్ అయ్యి చాలా తక్కువ ఎత్తులో క్యాచ్ అందుకున్నాడు. ఈ అద్భుతమైన క్యాచ్‌తో బవుమా పెవిలియన్ చేరాడు. ఇది కోహ్లీకి టెస్టుల్లో 100వ క్యాచ్ కావడం విశేషం.
ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన సౌతాఫ్రికా వికెట్ కీపర్ వెరీనే (0)ను కూడా షమీ అవుట్ చేశాడు. ముందుకొచ్చి బ్యాటింగ్ చేసేందుకు వెరీనే ప్రయత్నించాడు. కానీ అవుట్ సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతి వికెట్ కీపర్ వైపు వెళ్లింది. ఇది కూడా చాలా తక్కువ ఎత్తులో వచ్చింది. అయితే ఈసారి వేగంగా స్పందించిన పంత్ ఈ క్యాచ్ పట్టేశాడు. దీంతో వెరీనే డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. ఆ ఓవర్ ముగిసేసరికి సఫారీ జట్టు 160/6తో నిలిచింది.