న్యూఢిల్లీ, డిసెంబర్ 12: వెండి రికార్డుల (Silver Price) మీద రికార్డులు బద్దలుకొడుతున్నది. కిలో ధర ఏకంగా రూ.2 లక్షలకు చేరువైంది. వరుసగా మూడురోజులుగా పెరుగుతున్న వెండి శుక్రవారం మరోమెట్టు పైకి ఎక్కింది. కిలో ధర రూ.5,100 ఎగబాకి రూ.1,99,500 పలికింది. ఈ ధరలు దేశ రాజధాని న్యూఢిల్లీ మార్కెట్కు సంబంధించినవి. గురువారం రూ.2,400 పెరిగిన కిలో ధర బుధవారం రికార్డు స్థాయిలో రూ.11,500 పెరిగిన విషయం తెలిసిందే. గడిచిన మూడు రోజుల్లో కిలో ఏకంగా 20 వేల వరకు అధికమైంది.
అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ అధికంగా ఉండటంతోపాటు పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్మెంట్లను సురక్షితమైన అతి విలువైన లోహాలవైపు మళ్లించడంతో ధరలు పుంజుకుంటున్నాయని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది. వెండితోపాటు పసిడి పరుగులు పెట్టింది. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర రూ.1,100 ఎగబాకి రూ.1,33,600 పలికింది. అంతకుముందు ఇది రూ.1,32,490గా ఉన్నది. ఇటు హైదరాబాద్లో 24 క్యారెట్ గోల్డ్ ధర రూ.2,450 ఎగబాకి రూ.1,33,200కి చేరుకోగా, 22 క్యారెట్ ధర కూడా అంతేస్థాయిలో పెరిగి రూ.1,22,100 పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 64 డాలర్లు ఎగబాకి 4,377 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, అలాగే వెండి 65 డాలర్ల వద్ద కొనసాగుతున్నది.
ఫ్యూచర్ మార్కెట్లో వెండి చారిత్రక గరిష్ఠ స్థాయి పలికింది. మార్చి నెల డెలివరీకిగాను కిలో వెండి ఏకంగా రూ.1,420 అధికమై రూ.2 లక్షలు దాటింది. ఫ్యూచర్ ట్రేడింగ్ మార్కెట్లో ఇదే గరిష్ఠ స్థాయి కావడం విశేషం. గడిచిన నాలుగ సెషన్లలో వెండి ఏకంగా రూ.18,620 లేదా 10 శాతం ఎగబాకింది. సోమవారం రూ.1,81,742గా ఉన్న ధర ప్రస్తుతం రూ.2 లక్షలు అధిగమించింది. అలాగే ఫిబ్రవరి నెల డెలివరీకిగాను గోల్డ్ ధర రూ.1,34,966గా నమోదైంది.
దేశీయ మార్కెట్లో వెండి మరో చారిత్రక గరిష్ఠ స్థాయిని తాకింది. రూపాయి బలహీనంగా ఉండటం, పెట్టుబడుల డిమాండ్ అధికంగా ఉండటం వల్లనే ధరలు దూసుకుపోతున్నాయి.
– దిలీప్ పార్మర్, హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ రీసర్చ్ అనలిస్ట్