న్యూఢిల్లీ, డిసెంబర్ 12: భారత్, రష్యా దేశాలను చైనాకు అమెరికా కోల్పోయినట్లు కొన్ని నెలల క్రితం వ్యాఖ్యానించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఆ మూడు దేశాలతో చేతులు కలిపి కొత్త కూటమిని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే కూటమిలోకి జపాన్ను కూడా చేర్చుకుంటే ఎలా ఉంటుందని కూడా ఆయన యోచిస్తున్నట్లు అనధికార వార్తలు వెలువడ్డాయి. తన దీర్ఘకాల శత్రువులైన చైనా, రష్యాలతోపాటు భారత్, జపాన్లను కలుపుకుని కోర్-5 బ్లాక్ ఏర్పాటు చేయడంపై వాషింగ్టన్లో జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. జీ7కు పూర్తి విరుద్ధంగా ఈ గ్రూపు ఉండాలన్నది ట్రంప్ ఆలోచనగా పొలిటికో అనే వార్తాపత్రిక తెలిపింది. ఈ ప్రతిపాదన జాతీయ భద్రతా వ్యూహానికి సంబంధించిన నివేదికలో రక్షణ శాఖ సూచించినట్లు పత్రిక వెల్లడించింది.
ఈ ప్రతిపాదన ఆచరణలోకి రావడం అసాధ్యమని రాజకీయ నిపుణులు కొట్టివేస్తున్నప్పటికీ అయితే అలాంటి ప్రతిపాదనలు ట్రంప్ నుంచి మాత్రమే ఆశించగలమన్న వాదన కూడా వినిపిస్తోంది. మిత్ర దేశాల కన్నా ప్రత్యర్థులతోనే ఒప్పందాలు చేసుకోవడం ట్రంప్ ప్రత్యేకత. తమ ప్రాంతంలో బలీయమైన శక్తిగా ఉన్న దేశాలతో చేతులు కలిపేందుకు ట్రంప్ వెనుకాడబోరని భద్రతా వ్యవహారాలపై జాతీయ భద్రతా మండలి మాజీ డైరెక్టర్ టోరీ టాసిగ్ తెలిపారు. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోకపోవడం, ఉక్రెయిన్ యుద్ధాన్ని సాకుగా చూపిస్తూ భారత్, చైనా, రష్యాపై దిగుమతి సుంకాలు విధించి ఉద్రిక్తతలను సృష్టించిన ట్రంప్ ఇప్పుడు ఆ మూడు దేశాలతో కలసి కూటమి కట్టాలని యోచించడం అసక్తికర పరిణామంగా పరిశీలకులు భావిస్తున్నారు.
రష్యా-ఉక్రెయిన్ పోరుతో ప్రపంచ యుద్ధమే!
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సంవత్సరాల తరబడి కొనసాగుతుండటం పట్ల ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని ఆయన హెచ్చరించారు. గురువారం శ్వేతసౌధంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా కేవలం గత నెలలోనే బాంబు, ఇతర దాడుల కారణంగా 25 వేల మంది ప్రజలు మరణించారని, వీరిలో అధికులు సైనికులు ఉన్నారని చెప్పారు. ఇది ఆగిపోవాలని తాను కోరుకుంటున్నానన్నారు.