రాజన్న సిరిసిల్ల, జనవరి 14(నమస్తే తెలంగాణ) : జిల్లాలో సిరిసిల్ల, వేములవాడలో మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైంది. ఈనెల 13న ఓటర్ల లెక్క తేలడంతో ఇక రిజర్వేషన్ల కేటాయింపులు జరగనుండగా ఆశావాహుల్లో రిజర్వేషన్ల గుబులు మొదలైంది. రిజర్వేషన్లు కలిసొస్తే పోటీ చేయడానికి ఉవ్విళ్లూరుతున్న అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. కార్మిక, ధార్మిక క్షేత్రాలైన సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటిల్లో ఎన్నికల సందడి మొదలవ్వగా అశావాహులు ఇప్పటికే తమ వార్డుల్లో ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. సంక్రాంతి పర్వదిన వేళ జోరుగా ప్రయత్నాలు చేస్తుండటం గమానార్హం.
2020లో జరిగిన రిజర్వేషన్ల ప్రకారం సిరిసిల్ల మున్సిపాలిటిల్లో 39 వార్డుల్లో ఎస్టీ జనరల్ 1, ఎస్సీలకు 3(2జనరల్, మహిళకు 1), బీసీలకు 15 స్థానాలు ( బీసీ జనరల్‌కు 8, మహిళలకు 7), జనరల్ కు 9, జనరల్ మహిళలకు 11 కేటాయించారు. వేములవాడ మున్సిపాలిటీల్లో 28 వార్డుల్లో ఎస్టీ జనరల్ కు 3, ఎస్సీలకు 4(జనరల్ – 2, మహిళలకు-2), బీసీలకు 9 స్థానాలు ( జనరల్-5, మహిళలకు 4), జనరల్ మహిళకు 8 స్థానాలు, జనరల్ కు 6 స్థానాలు కేటాయించిన విషయం తెలిసిందే.
అందరి చూపు బీఆర్ఎస్ వైపే..
సిరిసిల్ల మున్సిపాలిటీలో ఎన్నికల సమీపిస్తున్న వేళ అందరి చూపు బీఆర్ఎస్ వైపే ఉంది. సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలు కంచుకోటగా ఉన్నాయి. గత మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కే ప్రజలు పట్టం కట్టిన విషయం తెలిసిందే. దీంతో ఆశావాహులు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్ల కుప్రాతినిధ్యం వహించడంపై అధికారంలో ఉన్న సమయంలో వేలాది కోట్లతో అభివృద్ధి చేయడంతోపాటు ప్రతి పక్షంలోనూ ప్రజా గొంతుకగా మారారు. ఈ నేపథ్యంలో ఆశావాహులు, సిట్టింగ్ వార్డు సభ్యులు సైతం పార్టీ టికెట్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపి పార్టీలకు అభ్యర్థులు సైతం లేకపోవడం, పక్క పార్టీనేతలను లాకేందుకు యత్నాలు చేపట్టడం గమనార్హం.