Hyderabad | కట్టుకున్నోడి కోసం ఓ మహిళ దొంగగా మారింది. భర్త చేసిన అప్పులు తీర్చేందుకు చైన్ స్నాచింగ్‌కు పాల్పడింది. కానీ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసిన ఆ మహిళకు.. దొంగతనాలు చేతగాకపోవడంతో అరగంటలోనే దొరికిపోయింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. మేడ్చల్ జిల్లాకు చెందిన రాజేశ్ అనే వ్యక్తి వరంగల్‌కు చెందిన అనితారెడ్డిని రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. గతంలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసిన అనితా రెడ్డి.. ప్రస్తుతం ఇంట్లోనే ఖాళీగా ఉంటుంది. అయితే తనను చూసుకోవడానికి భర్త రూ.5 లక్షల వరకు అప్పు చేసి.. తరచూ బాధపడుతుండటంతో అనితా రెడ్డి తట్టుకోలేకపోయింది. తన కోసం చేసిన అప్పును తానే ఎలాగైనా తీర్చాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే సులువుగా, తొందరగా మనీ సంపాదించాలని.. దొంగతనాలు చేసేందుకు సిద్ధపడింది.
ఈ క్రమంలో మియాపూర్ ప్రాంతానికి చెందిన నల్ల కమల అనే మహిళ మెడలో నుంచి చైన్ కాజేసేందుకు యత్నించింది. లిఫ్ట్‌లో వెళ్తున్న కమల చైన్ స్నాచింగ్ చేసేందుకు యత్నించగా.. బాధితురాలు గట్టిగా కేకలు వేసింది. దీంతో భయపడిపోయిన అనితా రెడ్డి చేతికి అందిన అర తులం నల్లపూసల గొలుసుతో అక్కడి నుంచి పారిపోయింది. అయితే బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సనత్ నగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. లిఫ్ట్ సమీపంలోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా అరగంటలోనే నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.