చెన్నై: డీఎంకే ఎంపీ దయానిధి మారన్(MP Dayanidhi Maran) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు మహిళలతో ఉత్తరాది మహిళలను పోల్చుతూ ఆయన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో అమ్మాయిలను చదువుకోవాలని చెబుతామని, కానీ ఉత్తర భారతంలో మహిళలను వంటగదికే పరిమితం చేస్తారని, పిల్లల్ని కనమంటారని మారన్ అన్నారు. ఖైద్ ఏ మిల్లత్ ప్రభుత్వ మహిళా కాలేజీ ఈవెంట్లో పాల్గొని ఆయన మాట్లాడారు. మన అమ్మాయిలు ల్యాప్‌టాప్ పట్టుకుని చాలా గర్వంగా ఫీలవుతారని, ఇంటర్వ్యూలకు హాజరవుతారని, పీజీ చదువుకుంటారన్నారు. చదువుకోవాలని ప్రోత్సహించడం వల్ల తమిళనాడు అమ్మాయిలు కాన్ఫిడెంట్‌గా కనిపిస్తారని, కానీ ఉత్తరాదిలో ఏం చేస్తారో తెలుసా, అమ్మాయిలు ఉద్యోగం చేయవద్దు అంటారని, ఇంట్లోనే ఉండాలని చెబుతారని, కిచెన్‌లో ఉండాలని లేదా పిల్లలు కనాలని ఆదేశిస్తారన్నారు.
ఎంపీ మారన్ వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఉత్తరాది ప్రజల్ని దయానిధి మారన్ మళ్లీ దూషించారని తమిళనాడు బీజేపీ ప్రతినిధి నారాయణన్ తెలిపారు. ఎందుకు ఇలా మాట్లాడుతారో తనకు తెలియదని, డీఎంకే నేతలు ఇలా ప్రవర్తిస్తారని, దయానిధి మారన్‌కు కామన్సెన్స్ ఉందని భావించడం లేదని బీజేపీ నేత అన్నారు.