కరీంనగర్ : రామగుండం ( Ramagundam ) పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో పట్టుబడ్డ రూ.కోటి 30 లక్షల విలువగల గంజాయిని (Ganja ) డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో మానకొండూరు వద్ద పోలీసులు దహనం చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ (CP Srinivas) మాట్లాడుతూ 2021 నుంచి వివిధ పోలీసు స్టేషన్లలో నమోదైన 64 కేసుల్లో నిందితుల నుంచి 521.544 కిలోల ప్రభుత్వ నిషేధిత గంజాయిని స్వాధీనం చేసుకున్నామని వివరించారు.
ఎన్డీపీఎస్(NDPS) చట్ట ప్రకారం కోర్టు అనుమతి తీసుకుని, న్యాయాధిపతుల ముందు కేసు ప్రాపర్టీని ఎఫ్ఎస్ఎల్ కోసం శాంపిల్ తీసి మిగిలిన మొత్తాన్ని వెంకటరమణ ఇన్సినేటర్ ఫ్యాక్టరీ వద్ద పర్యావరణ కాలుష్య నియంత్రణ నిబంధనలను పాటిస్తూ దహనం చేశామన్నారు. దహనం చేసిన నిషేధిత గంజాయి విలువ సుమారు రూ. 1,30,38,600 వివరించారు.
అక్రమార్జనలో భాగంగా గంజాయి సాగు, విక్రయిస్తూ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని యువతను ప్రలోభాలకు గురి చేస్తూ మత్తులోకి దించుతున్నారన్నారు. అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడే వారిని అరికట్టడం కోసం స్థానిక, స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసుల ద్వారా విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఎవరైనా గంజాయి , ఇతర మత్తు పదార్థాలను విక్రయిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.