మోర్తాడ్, ఫిబ్రవరి 5: ప్రత్యేక తరగతులకు హాజరయ్యే పదో తరగతి విద్యార్థులకు స్నాక్స్ అందించేందుకు ప్రభుత్వం 19 రోజులకు మాత్రమే గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ నిధులు మంజూరు చేసింది. గతేడాది వరకు 40 రోజుల పాటు స్పెషల్క్లాసులకు వెళ్లే విద్యార్థులకు 40 రోజుల పాటు స్నాక్స్ అందజేసి ఈ సంవత్సం కేవలం 19 రోజులు మాత్రమే అందించాలనే నిర్ణయంపై ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్నది. మార్చి 14 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వ, మోడల్ స్కూళ్లలో ప్రత్యేక తరగతులు ప్రారంభమయ్యాయి.
జిల్లాలో ప్రభుత్వ ఉన్నతపాఠశాలలు, మోడల్ స్కూళ్లు కలిపి మొత్తం 237 ఉండగా, ఇందులో 8,401 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి 19 రోజుల పాటు అంటే ఫిబ్రవరి 16 నుంచి మార్చి 10 వరకు స్నాక్స్ అందించేందుకు విద్యాశాఖ ఒక్కో విద్యార్థికి రూ.15 చొప్పున జిల్లాకు రూ.23లక్షల 94వేల 285 మంజూరయ్యాయి. కాని పదో తరగతి పరీక్షలు మార్చి 14నుంచి ఏప్రిల్ 16 వరకు నిర్వహించనున్న నేపథ్యంలో పరీక్షలు ముగిసే వరకు ఉపాధ్యాయులు విద్యార్థులకు స్పెషల్‌క్లాసులు నిర్వహిస్తూ పరీక్షలకు సన్నద్ధం చేస్తారు.
ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలు, మోడల్స్కూళ్లలో మంచి ఫలితాలు రాబట్టాలనే ఉద్దేశంతో ఉపాధ్యాయులు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. ప్రతి సబ్జెక్ట్‌లో ఏ విధంగా ప్రిపేర్కావాలనే సూచనలు, పరీక్షలకు ఏ విధంగా తయారు కావాలో అవగాహన కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు పరీక్షలు ముగిసే వరకు స్నాక్స్ అందించాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్పెషల్ క్లాసులు నిర్వహిస్తున్న పాఠశాలల్లో సాయంత్రం రాగిజావ అందిస్తున్నారు, కొన్ని పాఠశాలల్లో అప్పుడప్పుడు స్నాక్స్ అందిస్తున్నారు. గతంలో మాదిరిగా 40రోజులపాటు లేదా పరీక్షలు ముగిసే వరకైనా విద్యార్థులకు స్నాక్స్ అందించాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గతంలో మాదిరిగా స్నాక్స్ అందజేయాలి
పదో తరగతి విద్యార్థులకు డిసెంబర్ నుంచి ఉదయం, జనవరి ఒకటి నుంచి సాయంత్రం స్పెషల్క్లాసులను ప్రారంభించాం. అయితే విద్యార్థులకు సాయంత్రం స్నాక్స్ అందించే విషయంలో గతంలో మాదిరిగా 40రోజుల పాటు అందిస్తే బాగుండేది. ఎందుకంటే విద్యార్థులను ఇప్పటి నుంచి పరీక్షలు ముగిసే వరకు సన్నద్ధం చేసేందుకు స్పెషల్‌క్లాసులు నిర్వహిస్తాం.
-ఆంధ్రయ్య, ఎంఈవో, కమ్మర్పల్లి
పరీక్షలు ముగిసేవరకు స్నాక్స్ అందించాలి
పదో తరగతిలో మంచి ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులందరూ కృషి చేస్తున్నారు. అన్ని పాఠశాలల్లో ప్రత్యేక తరగతుల నిర్వహణ సబ్జెక్ట్‌ల వారీగా కొనసాగుతుంది. పరీక్షలు ముగిసే వరకు విద్యార్థులకు స్నాక్స్ అందించాలని తపస్ తరపున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.
-సల్లూరి కిషన్, తపస్ కమ్మర్పల్లి మండల అధ్యక్షుడు