హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ) : తార్నాకలోని ఆర్టీసీ దవాఖానకు నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్(ఎన్ఏబీహెచ్) నుంచి గుర్తింపు పొందింది. నాణ్యమైన వైద్యసేవలు, రోగుల ఆరోగ్య భద్రతను నిర్ధారించే దిశగా దవాఖాన చేస్తున్న కృషికి ఇదొక మైలురాయిగా నిలువనున్నది. కొన్నేండ్లుగా మెరుగైన సదుపాయాలు కల్పిస్తూ వైద్యసేవలను బలోపేతం చేయడంతో ఈ గుర్తింపు వచ్చినట్టు దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ శైలజామూర్తి తెలిపారు.
అధునాతన అత్యవసర, క్రిటికల్ కేర్ సేవలు, మాడ్యులర్ సూపర్ స్పెషాలిటీ ఆపరేషన్ థియేటర్లు, క్యాథ్‌ల్యాబ్ ఏర్పాటుతోపాటు మెడికల్ విద్య, శిక్షణ కార్యక్రమాలను విస్తరించినట్టు తెలిపారు. 100 సీట్లతో బీఎస్సీ నర్సింగ్ కళాశాల, వృత్తివిద్యా కళాశాల, శస్త్రచికిత్స, ఆర్థోపెడిక్స్, జనరల్ మెడిసిన్‌లో డీఎన్బీపీజీ కార్యక్రమాలు ప్రారంభించినట్టు చెప్పారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ శైలజామూర్తి, మెడికల్ అడ్మినిస్ట్రేటర్ శ్రీనివాస్, ఇతర వైద్య బృందాన్ని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి అభినందించారు.