గుమ్లాపూర్‌లో నిర్వహించిన అధికారిక సభా.. కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభగా మారింది. సీఎం రేవంత్‌రెడ్డి సహా సభకు హాజరైన మంత్రులు హస్తం గుర్తుకు ఓటు వేయాలని కోరడం చర్చకు దారితీసింది. సభా వేదిక పక్కన డిగ్రీ కళాశాల, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్‌కు శిలాఫలకాలను ఆవిష్కరించిన సీఎం, మంత్రులు అధికారులు ఏర్పాటు చేసిన వేదికపై రాజకీయ ప్రసంగాలు చేయడం విమర్శలకు తావిస్తున్నది. నాలుగైదు రోజులుగా సభ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఉన్నతాధికారులు సైతం అటువైపు రాకపోవడం చర్చనీయాంశమైంది. ఈ సభలో కరీంనగర్ కార్పొరేషన్ పేరును పదే పదే ప్రస్తావించిన సీఎం రెండేళ్లలో రూ.1,489 కోట్లు ఇచ్చామని అబద్ధాలు చెప్పి జనాన్ని నమ్మించే ప్రయత్నం చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నిధులు ఎక్కడిచ్చారని, వీటితో ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తున్నారో సీఎం చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
కరీంనగర్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ)/ చొప్పదండి : చొప్పదండి మండలం గుమ్లాపూర్‌లో సీఎం రేవంత్ ప్రజాపాలన ప్రగతిబాట సభకు నాలుగైదు రోజులుగా జిల్లా ఉన్నతాధికారులు ఇక్కడ ఏర్పాట్లను పర్యవేక్షించారు. చొప్పదండి నియోజకవర్గ పరిధిలోని గంగాధర మండలం మధురానగర్‌లో 5 కోట్లతో నిర్మించనున్న డిగ్రీ కళాశాల, రామడుగు మండల కేంద్రంలో 45.15 కోట్లతో నిర్మించనున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ నిర్మాణానికి శిలాఫలకాల ఆవిష్కరణ ఉండడంతో అధికారిక కార్యక్రమంగా ప్రకటించారు.
ఆ మేరకు గురువారం వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి, సభా ప్రాంగణంలో మంత్రులతో కలిసి శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఆ తర్వాత వేదికపై శ్రీ సీతారామచంద్ర జిల్లా మహిళా సమాఖ్యకు చెక్కును అందించారు. ఇక్కడి వరకు అధికారిక కార్యక్రమంలాగనే నడిచినా.. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. తన ప్రసంగంలోనూ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేయాలని సీఎం పదే పదే చెప్పారు. మంత్రులు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించి కాంగ్రెస్ హస్తం గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఇది చూసిన ప్రజలు.. ఇది అధికారిక సభనా? కాంగ్రెస్ ప్రచార సభనా? అర్థంకాక చర్చించుకున్నారు.
గుమ్లాపూర్ సభను అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సభగా మార్చారనే విమర్శలు వెల్లువెత్తాయి. గత పంచాయతీ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించేందుకు హుస్నాబాద్ మున్సిపాలిటీలో సభ నిర్వహించిన సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులకు ఓటు వేయాలని కోరారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా గుమ్లాపూర్‌లో సభ ఏర్పాటు చేసి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేయాలని ప్రచారం చేశారు.

అయితే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో రాష్ట్రంలోని మున్సిపాలిటీలకు 2,778 ఇచ్చామని, ఇందులో ఒక్క కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌కే 1,489 కోట్లు ఇచ్చామని చెప్పుకున్నారు. నిజానికి కరీంనగర్ కార్పొరేషన్‌కు విడుతల వారీగా వచ్చే నిధులు కేవలం 65 కోట్లు మాత్రమే వచ్చినట్లు తెలుస్తున్నది. అంతేకాకుండా చొప్పదండికి 50 కోట్లు ఇచ్చామని సీఎం ప్రకటించారు. కానీ, రెండేళ్లలో కేవలం 15 కోట్లు మాత్రమే వచ్చాయని తెలుస్తున్నది. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌కు 512 కోట్లు రాని నిధులను వచ్చినట్టు సీఎం ప్రకటించుకోవడం ఎన్నికల సమయంలో ప్రజలను తప్పుతోవ పట్టించినట్లేనని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
నిధులు విడుదల చేసింది నిజమే అయితే, సభా సాక్షిగా సీఎం వెల్లడించిన నిధుల కేటాయింపు వాస్తవమే అయితే, మున్సిపాలిటీల వారీగా శ్వేత పత్రం విడుదల చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అది కూడా వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో ఇదంతా తప్పుడు ప్రచారంగానే పరిగణిస్తామని చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో స్థానిక నాయకులైనా నిధుల విడుదల వివరాలు వెల్లడిస్తారా.. లేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి చెప్పిన మాటలు పచ్చి అబద్ధాలనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి విపక్షాలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి.
చొప్పదండి, ఫిబ్రవరి 5 : గుమ్లాపూర్ సీఎం రేవంత్ సభకు జనం మధ్యాహ్నం 12 గంటలకే వచ్చారు. అయితే మధ్యాహ్నం 2.45 గంటలకు రావాల్సిన ఆయన, సాయంత్రం 3.55 గంటలకు రాగా అప్పటిదాకా ఓపికతో వేచి చూశారు. సభా ప్రాంగణంలో తాగునీటి సౌకర్యం లేకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డారు. సీఎం 4 గంటలకు వేదికపైకి రాగా అంతా ఆసక్తిగా చూశారు. కానీ, ఎప్పటిలాగే ఊకదంపుడు ఉపన్యాసం అందుకోవడంతో ఐదు పది నిమిషాల నుంచే సభ నుంచి జనం ఒక్కొక్కరుగా లేచి బయటకు వెళ్లారు. సభ వెనక భాగంలో కూర్చున్న వారే కాకుండా మధ్యలో కూర్చున్న మహిళలు కూడా పెద్ద సంఖ్యలో లేచి వెళ్లి వేయారు. సీఎం ప్రసంగంలో పసలేదని చర్చించుకుంటూ వెళ్లిపోవడం కనిపించింది. పోలీస్ సిబ్బంది ఆపినా ఆగకుండా వెళ్లడంతో గ్యాలరీలు ఖాళీగా కనిపించాయి.