భీమ్‌గల్, ఫిబ్రవరి 5: బీఆ ర్ఎస్ ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీగా మారిన భీమ్‌గల్‌ను రూ.200 కోట్లతో అభివృద్ధి చేసి, పట్టణ రూపరేఖలు మార్చివేసినట్లు మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. భీమ్‌గల్ పట్టణాభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ బీఆర్ఎస్ అని పేర్కొన్నారు. తాను తాము మొదలు పెట్టిన పనులు కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో ఎక్కడికక్కడ నిలిచిపోయాయని మండిపడ్డారు. భీమ్‌గల్ పట్టణంలోని 12, 7, 11వ వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు మల్లెల అనుపమ ప్రసాద్, అస్లాం, రాజూనాయక్ తరుఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌ల్లో వేముల మాట్లాడారు. వెనుకబడిన గ్రామంగా ఉన్న భీమ్‌గల్‌ను మున్సిపాలిటీగా మార్చి కేసీఆర్, కేటీఆర్ సహకారంతో సుమారు రూ. 200 కోట్ల నిధులు తెచ్చి అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించామని, నాలుగు లేన్ల రోడ్లు, సెంట్రల్ లైంటింగ్, డివైడర్లతో పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ. 30 కోట్లు వెచ్చించి పోచంపాడ్ ప్రాజెక్టు నుంచి నీళ్లు తెచ్చి ఇంటింటికీ స్వచ్ఛమైన నీటిని అందించి అరవై ఏండ్ల ఆడబిడ్డల తాగునీటి గోసను తీర్చిన ఘనత తమదేనన్నారు.
కాంగ్రెస్ హయాంలో మూతపడిన బస్‌డిపోను రూ. కోటితో తిరిగి తెరిపించగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ దానిని మూసేసి ప్రజలను కష్టాలపాలు చేసిందని మండిపడ్డారు. మిగిలిపోయిన సీసీ రోడ్ల పనులకు అసెంబ్లీ ఎన్నికలకు ముందే తాము రూ. 10 కోట్లు మంజూరు చేశామని, కానీ రెండేండ్లుగా ఆ పనులను ఆపేసిన కాంగ్రెస్ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు రాగానే హడాడుడిగా శంకుస్థాపనలు చేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్నికలు లేకుంటే పనులు చేయరా అని ప్రశ్నించారు.
హామీల అమలులో రేవంత్ సర్కారు విఫలం
మహిళలకు రూ. 2500, రూ. 4వేల పెన్షన్, తులం బంగారం, కొత్త పెన్షన్ల ప్రారంభం, రూ. రెండు లక్షల రుణమాఫీ, రైతుబంధు పెంపు, నిరుద్యోగ భృతి వంటి ఏ ఒక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. హామీల అమలులో రేవంత్ ప్రభుత్వం విఫలమైందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడిస్తేనే, వాళ్లకు ప్రజల కోపం అర్థమవుతుందన్నారు. అప్పుడే హామీల అమలుకు దిగివస్తారన్నారు.
చిల్లిగవ్వ ఇవ్వని కేంద్రం
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేవుడి పేరు మీద రాజకీయలు చేయడం తప్ప తెలంగాణ అభివృద్ధికి అదనంగా చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదన్నారు. అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ను ఆదరించాలని, కారు గుర్తుకు ఓటు వేసి తమ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వేముల కోరారు. ప్రచార కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల కన్వీనర్ దొనకంటి నర్సయ్య, మాజీ ఎంపీపీ, జడ్పీటీసీ ఆర్మూర్ మహేశ్, చౌట్పల్లి రవి, కౌన్సిలర్ అభ్యర్థులు మల్లెల అనుపమ ప్రసాద్, అస్లాం, రాజూనాయక్, నాయకులు జిందం రమేశ్ లడ్డు, ఇక్రం తదితరులు పాల్గొన్నారు.
వేముల సమక్షంలో చేరికలు
భీమ్‌గల్ మండలంలోని బాబాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు ఇదాప్ ప్రణయ్ గురువారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనకు మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ చౌట్పల్లి రవి, బీఆర్ఎస్ యువజన విభాగం నాయకుడు శ్రీను జాన్ తదితరులు పాల్గొన్నారు.