నేడు ప్రతి ఒక్కరూ పెట్టుబడుల వైపు చూస్తున్నారు. యువత సైతం మదుపుపై ఆసక్తిని కనబరుస్తున్నది.అయితే దేనిపై పెట్టుబడులు పెట్టాలన్న అయోమయం వెంటాడుతున్నది. ముఖ్యంగా భూమి-బంగారం పెట్టుబడుల్లో ఏది ఉత్తమం అన్నది ఎక్కువమందిని తొలుస్తున్న ప్రశ్న.ధరల విషయంలో నానాటికీ పోటీపడుతూ అటు భూములు, ఇటు బంగారం పెట్టుబడిదారుల్ని ఊరిస్తూనే ఉన్నాయి మరి.
భవిష్యత్తు భద్రత కోసం అనేక సాధనాల్లో మదుపు చేయడం ఆనవాయితీ. అలాంటి వాటిలో ఎవరైనా తొలుత ఎంచుకునేది బంగారం, భూమినే. ఈ రెండింటిలోనూ సందర్భాన్నిబట్టి పెట్టుబడులు, రాబడులు ఆధారపడి ఉంటాయి. అయితే వీటిలో మదుపు చేయడానికి ముందే లక్ష్యం, రిస్క్, ఎంత కాలానికి, పన్ను రాయితీలు, మార్కెట్ ఒడిదుడుకులు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఎంపికలో తికమకలేమైనా ఉంటే వాటి లాభనష్టాలను బేరిజు వేసుకుని మదుపు నిర్ణయాలను తీసుకోవాలి. పోర్టుఫోలియోలో ఈ రెండింటికి స్థానం కల్పించాలనుకున్నప్పుడు మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా వాటికి కేటాయింపులు జరపాలి. ముందుగా వాటిలో మదుపు చేయడానికి సానుకూలతలను, ప్రతికూలతలను పరిశీలిద్దాం.
భూమి
భూమికున్న విలువ ప్రాధాన్యతలు వేరు. ఇండ్లు, ప్లాట్లు, ఫ్లాట్లు, పొలాలు, ఫామ్లు, కమర్షియల్ ప్రాపర్టీలు, రీట్స్ ఇలా అనేక ఆప్షన్లు రియల్ ఎస్టేట్లో ఉన్నాయి. అయితే రియల్ ఎస్టేట్ పెట్టుబడి చాలా ఎక్కువ మొత్తం అవసరం అవుతుంది. అలాగే బంగారంతోపాటు అన్ని సాధనాల కన్నా దీనికి లిక్విడిటీ తక్కువ. చేతిలో కొంత మొత్తం ఉన్నా రుణం తీసుకుని కొనుగోలు చేసే అవకాశం ఇందులో ఉంటుంది. సొంతింటి కలను సాకారం చేసుకోవడానికి అతితక్కువ వడ్డీతో రుణాలు అందుబాటులో ఉన్నాయి. అయితే రెండో ఇంటి కొనుగోలుపై వచ్చే ఆదాయాలు తక్కువ. అన్ని రకాల ప్లాట్లకు రుణాలు లభించవు. అలాగే చట్టపరమైన లొసుగులను కూడా అర్థం చేసుకోవాలి. ఏ ప్రాపర్టీని కొనుగోలు చేసినా దానికి సంబంధించి చట్టపరమైన సలహా తప్పనిసరి. అలాగే రిజిస్ట్రేషన్ ఖర్చులూ ఎక్కువే. అయితే స్థిరాస్తి మీద రిస్క్ మిగతా వాటితో పోల్చితే తక్కువ. క్యాపిటల్ ఎక్కువగా ఉంటే చాలా సాధనాల కన్నా అధిక రాబడి వచ్చే వీలుంది. ధరలు ఎలా ఎగబాకుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక అద్దె ఆదాయమూ సగటున 4 శాతం వరకు ఉంటుంది. ఇప్పుడు తాజాగా దేశీయ మార్కెట్లో ప్రవేశించిన రీట్స్ ద్వారా దాదాపు 7 నుంచి 9 శాతం వరకు ఆదాయం పొందవచ్చు. స్థిరాస్తిని కొనుగోలు చేసే ముందు కూడా మదుపు లక్ష్యాలను నిర్దేశించుకోవాల్సిందే.
బంగారం లాంటి భద్రత
భారతీయులను బంగారం నుంచి విడదీయలేం. సంప్రదాయక మదుపు సాధనాల్లో పసిడిది ప్రథమ స్థానం. భద్రతకు మారుపేరుగా ఇది ప్రసిద్ధి. పుత్తడిలో మదుపును అత్యవసరాల్లో వెనక్కి తీసుకోవచ్చు. దీనికి లిక్విడిటీ చాలా ఎక్కువ. అలాగే అమ్మడం, కొనడం తేలిక. దీని కొనుగోలుకు పెద్దపెద్ద మొత్తాలు అవసరం లేదు. కాంట్రాక్టుల మీద సంతకం చేయడం, రిజిస్ట్రేషన్ వంటివీ ఉండవు. సెంట్రల్ బ్యాంకులు కూడా ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొవడానికి బంగారాన్నే నమ్ముకుంటాయి. గడిచిన దశాబ్దాలుగా బంగారం ధర పెరుగుతూ వస్తున్నది. పతనం కనిపించినా అది స్వల్పకాలానికే పరిమితం. 15 ఏండ్ల కాలపరిమితికి మదుపు చేస్తే ఏటా 14 శాతం చొప్పున రాబడి వచ్చింది. బంగారం మదుపు సాధనం మాత్రమే కాదు.. కుటుంబానికి మానసిక ధైర్యాన్నిచ్చే సాధనం కూడా. పరువు-ప్రతిష్ఠలకు చిహ్నంగా కూడా భావిస్తారు. దీనికితోడు, పోర్టుఫోలియో డైవర్సిఫికేషన్ చేయడానికి బంగారాన్ని ఒక ముఖ్య సాధనంగా పరిగణిస్తారు. ప్రతిఒక్కరి పోర్టుఫోలియోలో 10 నుంచి 15 శాతం వరకు బంగారానికి వాటా కేటాయించాలి. దీన్ని అత్యవసర నిధిగా కూడా మదుపు చేయవచ్చు.
ఏది ఉత్తమం
ఈ రెండు ఇన్వెస్ట్మెంట్లకూ కావాల్సిన మొత్తాల్లో చాలా వ్యత్యాసం ఉన్నది. రియల్ ఎస్టేట్లో క్యాపిటల్ ఎక్కువ, లిక్విడిటీ తక్కువ. దీర్ఘకాలానికి మాత్రమే రాబడి అధికంగా ఉంటుంది. స్వల్పకాల లావాదేవీలు చాలా తక్కువ. ఇక బంగారం అతి తక్కువ మొత్తంతో కొనుగోలు చేయవచ్చు. లిక్విడిటీ ఎక్కువ. ఎప్పుడంటే అప్పుడు అమ్మి అత్యవసరాలను సులువుగా తీర్చుకోవచ్చు. రియల్ ఎస్టేట్లో ఒడిదుడుకులు తక్కువ. బంగారం ధరల్లో కదలికలు చాలా ఎక్కువ. అయినప్పటికీ పదేండ్ల నుంచి 15 ఏండ్ల వరకు మదుపు మీద రెండింటిలోనూ ఆశించిన రాబడిని పొందవచ్చు. చారిత్రకంగా రియల్ ఎస్టేట్లో ఏటా సగటున 15 శాతం రాబడి ఉంటే, బంగారంలో 14.4 శాతం రాబడి ఉంటుంది. రియల్ ఎస్టేట్ మదుపులో విలువ పెరుగుదలతోపాటు అద్దె ఆదాయం అదనం. అందుబాటులో ఉన్న మూలధనాన్నిబట్టి రెండింటికీ పోర్టుఫోలియోలో కేటాయింపులు చేసుకోవడం లాభదాయకం.