న్యూఢిల్లీ: కేరళలో మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకుగాను తమ పార్టీ 115 స్థానాల నుంచి బరిలో దిగనున్నదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్ తెలిపారు. మిగిలిన 25 అసెంబ్లీ స్థానాలను నాలుగు మిత్రపక్ష పార్టీలకు విడిచిపెట్టినట్లు ఆయన వెల్లడించారు. జాబితాలోని ముఖ్యుల్లో కేరళ బీజేపీ అధ్యక్షుడు కే సురేంద్రన్ రెండు నియోజకవర్గాల నుంచి పోటీచేస్తున్నారని, అందులో ఒకటి కాసర్గోడ్లోని మంజేశ్వర్ కాగా, రెండోది పతనంథిట్టలోని కొన్నీ నియోజకవర్గమని అరుణ్‌సింగ్ చెప్పారు.
ఇక, ఇటీవల బీజేపీలో చేరిన మెట్రోమ్యాన్ ఈ శ్రీధరన్ పాలక్కడ్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారని అరుణ్‌సింగ్ తెలిపారు. కేరళ బీజేపీ మాజీ అధ్యక్షుడు కుమ్మనమ్ రాజశేఖరన్ నెమామ్ నుంచి, కేజే అల్ఫాన్స్ కంజిరప్పల్లి నుంచి, సురేష్ గోపి త్రిసూర్ నుంచి, అబ్దుల్ సలామ్ తిరూర్ నుంచి, కేరళ మాజీ డీజీపీ జాకోబ్ ఇరింజలకుడ నుంచి పోటీ చేస్తున్నారని ఆయన చెప్పారు. ఇక తమిళనాడులో ఎన్డీఏ భాగస్వామిగా పోటీచేస్తున్న బీజేపీ 20 స్థానాల్లో బరిలో దిగనుందని తెలిపారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు ఎల్ మురుగన్ ధారపురం నుంచి, సీనియర్ నాయకుడు హెచ్ రాజా కరైకూడి నుంచి పోటీ చేస్తున్నారని చెప్పారు.