హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 24 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయం, ఇతర సంక్షేమ పథకాల అమలులో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన తెలంగాణకు, కాంగ్రెస్ 13 నెలల పాలనలోనే పాత రోజులు వచ్చాయని నిరంజన్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ రక్షణకు రైతాంగం శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించిన అనంతరం ఆదిలాబాద్ రూరల్ మండలం యాపల్‌గూడలో రైతులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నేరవేర్చకపోవడంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, కౌలురైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. జిల్లాలో రామాయి గ్రామానికి చెందిన ఒక కౌలురైతు ప్రభుత్వం నుంచి సాయం వస్తుందనే ఆశతో ఎకరం భూమికి రూ.31,600 చెల్లించి కౌలుకు తీసుకున్నాడని, తీరా ఇప్పుడు ఆయన నష్టపోవాల్సి వచ్చిందని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మిర్చి రైతులకు క్వింటాకు రూ.28 వేలు చెల్లించి కొనుగోలు చేస్తే, ఇప్పుడు రూ.12 వేల ధర మాత్రమే వస్తున్నదని తెలిపారు. వరికి రూ.500 బోనస్ ఇస్తామనడంతో రాష్ట్రంలో రైతులు సన్నబియ్యం పడించారని, తీరా 80% మంది ప్రైవేట్ వ్యాపారులకు విక్రయించాక ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను తెరిచిందని చెప్పారు. వందలో పది మందికే బోనస్ ఇచ్చి అందరికీ ఇచ్చినట్టు కాంగ్రెస్ గొప్పలు చెప్పుకుంటున్నదని మండిపడ్డారు.