జూలూరుపాడు: సెప్టెంబర్ 29 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గుండెపూడిలో స్థానిక సమస్యలను గాలికి వదిలేసిన ప్రభుత్వ తీరుపై సీపీఎం తీవ్రస్థాయిలో మండిపడింది. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో తాళ్లూరు రవి, పంచాయితీ కార్యదర్శికి సీపీఎం నాయకులు మంగళవారం వినతిపత్రం అందజేసి, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకుడు భానోత్ మధు మాట్లాడుతూ.. ఐటీడీఏ ద్వారా మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సర్వేలు పూర్తయి ఏడాది గడుస్తున్నా, నేటికీ పట్టాలు పంపిణీ చేయకపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని ధ్వజమెత్తారు. ఓట్ల కోసం పేదల ఆశలతో చెలగాటమాడుతున్న నాయకులు తీరా అధికారంలోకి వచ్చాక మొండిచేయి చూపుతున్నారని దుయ్యబట్టారు. మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు చెల్లించకుండా ప్రభుత్వం లబ్ధిదారులను అప్పుల ఊబిలోకి నెట్టిందని, వడ్డీల భారం మోయలేక పేదలు నానా అవస్థలు పడుతున్నారని మండిపడ్డారు. రెండో విడత జాబితా విషయంలోనూ రోజుకో మాట చెబుతూ కాలయాపన చేయడం పాలకుల మోసపూరిత వైఖరికి అద్దం పడుతోందని విమర్శించారు.
ప్రభుత్వం కనీస నిధులు విడుదల చేయకపోవడంతో గ్రామ పంచాయతీల వ్యవస్థ పూర్తిగా కునారిల్లిందని విమర్శించారు. గుండెపూడిలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారిందని, గతంలో కొనుగోలు చేసిన ట్రాక్టర్లు, వాటర్ ట్యాంకర్లు మూలనపడి తుప్పు పడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో డెంగ్యూ, మలేరియా వంటి ప్రాణాంతక విషజ్వరాలు ప్రబలుతున్నా వైద్యారోగ్య శాఖ నిద్రమత్తులో జోగుతోందని తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోకముందే తక్షణమే గ్రామంలో వైద్య శిబిరాలు నిర్వహించాలని, మూలనపడిన ట్రాక్టర్లు, వాటర్ ట్యాంకర్లకు మరమ్మతులు చేయించి వినియోగంలోకి తేవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు వల్లమల్ల చందర్ రావు, ఇల్లంగి సీతారాములు, అనగంటి సత్యనారాయణ పాల్గొన్నారు.