నర్సంపేట, జూన్11 : మొరం మాఫియా అకృత్యాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. అక్రమ దందాను అడ్డుకుంటున్న అధికారులు, సిబ్బందిపై అధికార పార్టీ నాయకులు దాడులకు దిగుతున్నారు. దీంతో వారు భయభ్రాంతులకు గురవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. నర్సంపేట మున్సిపాలిటీ పరిధి మాధన్నపేట చెరువులో అధికార పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు మట్టి, మొరం దందాను కొన్ని రోజులుగా కొనసాగిస్తున్నారు. పలువురు గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో నర్సంపేట తహసీల్దార్ రవిచంద్రారెడ్డి ఆదేశాల మేరకు మాధన్నపేట జీపీవో చెలుకలపల్లి నర్సింహస్వామి మరో ఉద్యోగితో కలిసి మట్టి తరలిస్తున్న ప్రాంతానికి బుధవారం రాత్రి వెళ్లారు.
అక్రమంగా మట్టి తరలించొద్దని, ఎలాంటి అనుమతి లేదంటూ వారిని అడ్డుకున్నారు. దీంతో మొరం దందా నిర్వాహకులు దాడికి పాల్పడ్డారు. ఇద్దరి సెల్ఫోన్లు, బైక్ తాళాలు లాక్కొని తీవ్ర భయభ్రాంతులకు గురి చేశారు. గాయాలతో అక్కడి నుంచి బయటపడిన వారు నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. గురువారం గాయపడిన ఉద్యోగులకు పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ దాడిపై నియోజకవర్గంలోని రెవెన్యూ ఉద్యోగులు, సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, బాధితుడి ఫిర్యాదు మేరకు మొరం దందా నిర్వాహకుడైన నర్సంపేటకు చెందిన బైకాని రాకేశ్‌తో పాటు అతడి అనుచరులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై గూడ అరుణ్‌కుమార్ తెలిపారు.