నీలగిరి, అక్టోబర్ 19 : నల్లగొండ మున్సిపల్ పరిధిలో అనధికార సెల్లార్ల నిర్మాణాలు ఎకువయ్యాయి. పట్టణంలో ఎక్కడ నూతన భవన నిర్మాణం చేపడుతున్నా నిబంధనలు తుంగలో తొకి యథేచ్ఛగా భారీ భవనాలతోపాటు సెల్లార్లు కూడా నిర్మిస్తున్నారు. పట్టణంలోని రెండు మూడు ఫ్లోర్ల భవనాల్లో సైతం సెల్లార్లు నిర్మిస్తున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రం వారికి నామ మాత్రంగా నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకోవడం విమర్శలకు తావిస్తోంది. మున్సిపల్ నిబంధనల ప్రకారం రోడ్డు పకన బిల్డింగులు నిర్మించేవారు సెట్ బ్యాక్ తీసుకోవాలి. కానీ అవేవీ పట్టించుకోకుండా 10 ఫీట్లు, 20 ఫీట్లు ముందుకొచ్చి యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నారు. పట్టణంలో సెల్లార్ల నిర్మాణాలకు ఎలాంటి అనుమతుల్లేవు. దాదాపుగా నిర్మాణం చేపట్టే ప్రతీ కాంప్లెక్స్‌కు, భవనాలకు సెల్లార్ లేకుండా నిర్మాణం చేపట్టడం లేదు.
పట్టణంలోని హైదరాబాద్ రోడ్డు, దేవరకొండ రోడ్డుతో పాటు డాక్టర్స్ కాలనీ, రామగిరి రోడ్డులోని ఆర్డీవో కార్యాలయం ఎదుట నిర్మిస్తున్న భవనాలకు ఎలాంటి సెల్లార్ అనుమతుల్లేవు. కానీ వారు పర్మిషన్లు లేకుండానే సెల్లార్ల నిర్మాణాలు చేపడుతున్నారు. నల్లగొండ మున్సిపల్ పరిధిల్లో ఎన్నో వీధుల్లో సెల్లార్ల అక్రమ నిర్మాణాలు సాగుతూనే ఉన్నాయి. టౌన్ ప్లానింగ్ శాఖలో తగిన సిబ్బంది లేకపోవడంతో సకాలంలో స్పందించ లేకపోతున్నామని అధికారులు చెబుతూనే, పట్టణంలో ఎక్కడ కూడా సెల్లార్లు లేవంటూ సమాచార హక్కు చట్టంలో వివరించారు. కానీ అక్కడక్కడా నిర్మాణాలు జరుగతున్నాయని ఫిర్యాదులు రావడంతో నోటీసులు ఇస్తున్నారు. అయితే నిర్మాణాలు చేపడుతున్న వారి నుంచి ఎలాంటి స్పందన రావడంలేదంటున్నారు. పొట్టకూటి కోసం రోడ్డు పకన టేలాలు, బండ్లు పెట్టుకొని బతికే చిరు వ్యాపారుల దుకాణాలు తొలగించి ఇబ్బంది పెట్టే అధికారులు.. అనుమతుల్లే కుండా భారీ భవంతుల నిర్మాణాలు చేపడుతున్న పెద్దల జోలికి మాత్రం పోవడంలేదని మండిపడుతున్నారు.
సెల్లార్ల అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ వివరణ కొరగా పట్టణంలో ఎక్కడా సెల్లార్లకు అనుమతుల్లేవని, కొంతమంది షాపింగ్ కాంప్లెక్సులు, దుకాణాల్లో అనధికారికంగా సెల్లార్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయన్నారు. వారందరికి నోటీసులు జారీ చేశామని, వారి నుంచి సమాధానం వచ్చిన తరువాత చర్యలు తీసుకుంటామన్నారు.