యాదగిరిగుట్ట, అక్టోబర్ 19 : ఓ వైపు బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం.. మా పార్టీ అధిష్టానం పూర్తిగా ఎస్టీ, ఎస్టీ, బీసీలకే పెద్దపీట వేస్తున్నదని చెప్పుకొచ్చే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా డీసీసీ అధ్యక్ష పదవిని మళ్లీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అండెం సంజీవరెడ్డికే దక్కేలా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, ఆలేరు ఎమ్మెలే బీర్ల అయిలయ్య పావులు కదుపుతున్నట్లు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ క్యాడర్ గుసగుసలాడుతున్నారు. సిట్టింగ్ అధ్యక్షుడిగా ఉన్న అండెం సంజీవరెడ్డికే మళ్లీ పట్టం కట్టాలన్న ఆలోచనలో ఎమ్మెల్యేలు ఉన్నట్లు సమాచారం. ఒకసారి డీసీసీ అధ్యక్ష పదవి చేపట్టిన వారికి తిరిగి ఆ పదవి ఇవ్వడం కుదరదని, కొత్తవారికే అవకాశం ఇవ్వాలనే కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అయితే అధిష్టానం నిర్ణయాన్ని ఆలేరు, భువనగిరి ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని అత్యంత విశ్వసనీయవర్గాల సమాచారం. ఇటీవల భువనగిరితోపాటు యాదగిరిగుట్టలోని ‘సంఘటన్ సృజన్ అభియాన్’ కార్యక్రమంలో డీసీసీ ఎన్నికల రాష్ట్ర పరిశీలకుడు శరత్ రౌత్, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పాల్గొని అభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ నెల 21వ తేదీ వరకు నాయకుల అభిప్రాయాలు తీసుకుంటామని ఆశావాహుల పేర్లను రాహుల్ గాంధీ, ఖర్గేకు ఇస్తామన్నారు. అధిష్టానం నిర్ణయంతోనే డీసీసీ పదవి దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ తీరు చూస్తుంటే దాదాపుగా అండెం సంజీవరెడ్డికే డీసీసీ పదవి దక్కేలా ఎమ్మెల్యేల తీరు ఉందని పలువురు నాయకుల అభిప్రాయపడ్డారు. యాదగిరిగుట్టలో జరిగిన అభిప్రాయ సేకరణలో ఆలేరు నియోజకవర్గం నుంచి అండెం సంజీవరెడ్డికి మరోసారి డీసీసీ అధ్యక్ష పదవి వచ్చేలా ఏకగ్రీవంగా తీర్మానించాలనే వైఖరి బీర్ల అయిలయ్యలో కనిపించిందని పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు పేర్కొన్నారు. ఒకవైపు గతంలో డీసీసీగా పనిచేసే వారికి ఈసారి అవకాశం లేదనే నిబంధన ఉన్నా ఎమ్మెల్యేలు మాత్రం అవేమీ పట్టన్నట్టుగా ఉన్నట్లు తెలుస్తోంది. సంజీవరెడ్డినే డీసీసీ చైర్మన్‌గా కొనసాగించాలని ముఖ్యమంత్రిని కలిసి ఇద్దరు ఎమ్మెల్యేలు విన్నవించుకోగా తిరస్కరించినట్లు సమాచారం.
డీసీసీ పగ్గాలు ఎవరికి ఇస్తే బాగుంటుందని ఇటీవల భువనగిరి, యాదగిరిగుట్టలో ఎన్నికల రాష్ట్ర పరిశీలకుడు శరత్రౌత్ అభిప్రాయ సేకరణ చేపట్టారు. భువనగిరిలో జరిగిన సమావేశానికి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి డుమ్మా కొట్టారని తెలుస్తోంది. యాదగిరిగుట్టలో జరిగిన అభిప్రాయ సేకరణలో ఆయన తనకు అనుకూలమైన నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి మరోసారి అండెం సంజీవరెడ్డికే పగ్గాలు అప్పజెప్పాలని ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యతో పాటు పావులు కదుపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కాగా జిల్లాలో అత్యంత ప్రాధాన్యత కలిగిన డీసీసీ అధ్యక్ష పదవి ఎన్నిక సమయంలో పార్టీ సీనియర్లకు సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఆలేరు మండలంలోని మంతపురి గ్రామానికి చెందిన పీసీసీ జనరల్ సెక్రటరీ పల్లె శ్రీనివాస్‌గౌడ్, రాజాపేట మండలానికి చెందిన చల్లూరు వీరారెడ్డి, యాదగిరిగుట్ట మండలం గౌరాయిపల్లి గ్రామానికి చెందిన జిన్నా హరినాథ్‌రెడ్డి, మోటకొండూర్ మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎంపీటీసీ బుగ్గ పర్వతాలుతో పాటు మరి కొంత సీనియర్ నాయకులు తమకు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని బాధపడుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ అధికారంలో లేని సమయంలో జెండాలను మోసిన వారిని పక్కన పెడితే ఎలా అని వారు ఎమ్మెల్యేల తీరుపై ఆగ్రహం ప్రకటిస్తున్నట్లు అత్యంత విశ్వనీయవర్గాల సమాచారం.
డీసీసీ పదవికి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుండగా ఆలేరు నియోజకవర్గం నుంచి కేవలం గుండాల మండలానికి చెందిన అండెం సంజీవరెడ్డి ఒక్కరే బరిలో ఉన్నాడని ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య చెప్పకనే చెప్పినట్లు తెలుస్తోంది. కాగా ఆలేరు నుంచి మరికొంత మంది పార్టీ సీనియర్ నాయకులు సైతం బరిలో ఉన్నారు. ఆలేరు నియోజకవర్గం నుంచి సంజీవరెడ్డితో పాటు తుర్కపల్లి మండలానికి చెంది శంకర్ నాయక్, మోటకొండూర్ మండలం నుంచి సిరబోయిన మల్లేశ్ యాదవ్, రాజాపేట మండలంలోని కాల్వపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ సర్పంచ్, జడ్పీటీసీ, 2008లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన దివంగత లాజరస్ సతీమణి చాగ రాజలక్ష్మి, భువనగిరి నియోజకవర్గం నుంచి బీసీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు పోత్నాక్ ప్రమోద్ కుమార్, తంగపల్లి రవికుమార్, మున్సిపల్ మాజీ చైర్మన్ బర్రె జహంగీర్, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తడక వెంకటేశ్, నూతి రమేశ్ పోటీలో ఉన్నారు. అయితే పోటీలో ఉన్న సీనియర్లలో ఏ ఒక్కరికైనా డీసీసీ పదవి దక్కితే తమ మనుగడ కష్టంగా మారే అవకాశాలు ఉన్నాయనే సంకేతంతో ప్రస్తుత భువనగిరి, ఆలేరు ఎమ్మెల్యేలు అండెం సంజీవరెడ్డికే జై కొడుతున్నట్లు సమాచారం.