– ఆరు గ్యారెంటీలను అమలు చేయాలి
– బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మద్దులపల్లిలో ధర్నా, అంబేద్కర్ విగ్రహానికి వినతి
ఖమ్మం రూరల్, సెప్టెంబర్ 08 : అసెంబ్లీ గేటు ఎదుట జరిగిన ఉద్రిక్తత పరిస్థితులను బూచిగా చూపి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై పెట్టిన అక్రమ కేసులను తక్షణం ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఖమ్మం రూరల్ ఆధ్వర్యంలో మంగళవారం పార్టీ శ్రేణులు మెరుపు ధర్నాకు దిగారు. పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు, పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని మద్దులపల్లి గ్రామంలో పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశ ధోరణి ఎండగడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను టార్గెట్ చేస్తూ రెండు రోజులుగా తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తుందని వేణుగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి విధానాలను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు.
అనంతరం సూర్యాపేట ఖమ్మం జాతీయ రహదారి ప్రక్కనే గల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఎన్నికల ముందు అమలు కానీ హామీలను కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ ల పేరుతో ప్రజలకు ఇచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాలయాపన చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు పార్టీ తరఫున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం రూరల్ మండలం, ఏదిలాపురం మున్సిపాలిటీ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.