RS Praveen : బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసీఆర్ చావాలని, తాము కేసీఆర్ చావును కోరుకుంటున్నామని కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తలబిరుసు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి.
ఇదిలావుంటే ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు నడుస్తుండగానే సమావేశాలకు హాజరుకాకుండా అధికార పార్టీ ఎమ్మెల్యేలు కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై దాడికి వెళ్లారు. పోలీసులు వారిని దగ్గరుండి మరీ కేసీఆర్ ఫామ్ హౌస్‌కు తీసుకెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదే సమయంలో కాంగ్రెస్ కుట్రను పసిగట్టిన బీఆర్ఎస్ శ్రేణులు తమ అధినేత క్షేమం కోసం ఫామ్ హౌస్ వైపు పోలీసులు అడ్డు తగిలి అరెస్టులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బంజారాహిల్స్ పీఎస్‌లో వీర్లపల్లి శంకర్‌పై ఫిర్యాదు చేశారు.