Asha Bhosle | దిగ్గజ గాయని ఆశా భోస్లే చివరి సినిమా పాట ‘ఏ మేరీ జిందగీ’ ఆమె 93వ పుట్టినరోజు సందర్భంగా విడుదలైంది. హరీష్ వ్యాస్ దర్శకత్వంలో వచ్చిన ‘ఓమ్ కా హరి’ సినిమా కోసం 2023 చివర్లో ఆమె ఈ పాటను రికార్డు చేశారు. తండ్రీకొడుకుల కథతో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 18న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో రఘుబీర్ యాదవ్, అన్షుమన్ ఝా, సోని రాజ్దాన్ ముఖ్య పాత్రల్లో నటించారు.
ఈ ఏడాది ఏప్రిల్ 12న ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో గుండెపోటు, అనారోగ్య సమస్యల కారణంగా ఆశా భోస్లే కన్నుమూశారు. ఆమె మరణం తర్వాత విడుదలైన ఈ పాట వీడియోలో, ఆమె స్టూడియోలో పాట పాడుతున్నప్పటి అరుదైన దృశ్యాలతో పాటు, చిత్ర బృందంతో ముచ్చటించిన క్షణాలు ప్రేక్షకులను ఎంతగానో భావోద్వేగానికి గురిచేస్తున్నాయి. రాజీవ్ సరాంగ్ సంగీతం అందించిన ఈ పాటకు ప్రదీప్ శర్మ ఖుస్రో సాహిత్యం అందించారు. ఈ పాట తనకు చాలా బాగా నచ్చిందని, అడగ్గానే ఎలాంటి షరతులు లేకుండా వెంటనే పాడటానికి అంగీకరించానని ఆశా భోస్లే ఆ వీడియోలో గుర్తుచేసుకున్నారు. ఆమె మధుర గళం నుంచి వచ్చిన చివరి సినిమా పాట ఇదే కావడంతో, అభిమానులు సోషల్ మీడియాలో తీవ్ర భావోద్వేగంతో ఆమెకు ఘన నివాళులు అర్పించారు.