హైదరాబాద్, ఆగస్టు 8, (నమస్తే తెలంగాణ) : ఆదివాసీల హక్కులను పాలకులు విస్మరిస్తే గిరిజన ప్రాంతాల్లో ఆందోళనలు అనివార్యమవుతాయని మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు హెచ్చరించారు. అంతర్జాతీయ ఆదివాసీ గిరిజన దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఆదివాసీల సమస్యలు, ప్రభుత్వాల వైఖరిపై విశ్లేషిస్తూ శనివారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.
తెలుగు రాష్ర్టాల్లోని పాలకులు రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్‌ను కాపాడటంలో విఫలమయ్యారని ఆందోళన వ్యక్తంచేశారు. గిరిజనుల హకులు, భూమి, సంస్కృతి పరిరక్షణ కోసం తమ జీవితాన్ని అంకితం చేసిన హైమన్‌డార్ఫ్ సేవలు, రక్తసిక్తమైన గిరిజన ఉద్యమ చరిత్రను మననం చేసుకోవాలని సూచించారు. కుమ్రం భీం పోరాడిన నేలపైనే ప్రస్తుతం 50శాతం భూములను గిరిజనేతరులు అక్రమించారని, ఇది గిరిజన దినోత్సవ ఆశయాలను భ్రష్టు పట్టించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ట్రైబల్ సబ్ ప్లాన్ నిధుల బదిలీ: గిరిజన ఉపప్రణాళిక (ట్రైబల్ సబ్ ప్లాన్) నిధుల నుంచి 5 శాతం నిధులను నేరుగా షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని గ్రామపంచాయతీలకు బదిలీ చేయాలి.
పెసా చట్టం అమలు: పెసా చట్టాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తూ, చిరు అడవి ఉత్పత్తుల సేకరణ, భూసేకరణ, స్థానిక వనరుల నిర్వహణపై గ్రామసభలకు పూర్తి అధికారాలు కల్పించాలి.
యువతకు ఉపాధి: షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని నిరుద్యోగ గిరిజన యువతకు ఉపాధి, నైపుణ్యాభివృద్ధి (సిల్ డెవలప్మెంట్) అవకాశాలను కల్పించాలి.