పోటెత్తిన నిరుద్యోగం
గతంలో యువత ఉద్యోగాల కోసం ధర్నాలు చేస్తే.. కాంగ్రెస్ సర్కార్‌లో నోటిఫికేషన్లు వద్దని ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది. ఎక్కువ నోటిఫికేషన్లు ఇస్తుండటంతో అన్ని ఉద్యోగాలకు ఒకేసారి చదువలేకపోతున్నమని, నోటిఫికేషన్లు ఆపాలని ధర్నాలు చేస్తున్నరు.
-జూన్ 23న సచివాలయం ఎదురుగా రాజీవ్‌గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన రైతుభరోసా విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వంలో క్రమం తప్పకుండా ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇస్తున్నం. కేవలం 60 రోజుల్లో 11 వేల టీచర్ పోస్టులు భర్తీ చేసినం. ఏడాదిలోనే 70 వేల మందికి నియామక పత్రాలిచ్చినం.
-జూలై 19న ఘట్కేసర్లో అందెశ్రీ స్మృతివనానికి శంకుస్థాపన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామని, ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి యువతను నమ్మించిన కాంగ్రెస్.. గద్దెనెక్కింది మొదలు నిరుద్యోగులను వంచిస్తూ వస్తున్నది. గతంలో బీఆర్ఎస్ సర్కార్ ఇచ్చిన నోటిఫికేషన్లకే నియామక పత్రాలిచ్చి తామే కొలువులిచ్చినట్టు డబ్బా కొట్టుకున్నది. జాబ్ క్యాలెండర్‌ను తుంగలో తొక్కి.. గంగలో కలిపి యువతకు మొండిచెయ్యి చూపింది. రెండున్నరేండ్ల్ల తర్వాత రేవంత్ సర్కార్ ముక్కుతూ మూల్గుతూ హైడ్రా కోసం వేసిన 150 తాత్కాలిక డ్రైవర్, డీఆర్ఎఫ్ అసిస్టెంట్ పోస్టుల ఈవెంట్స్‌కు నిరుద్యోగ యువత పోటెత్తింది. వారికి సౌకర్యాలు కల్పించాల్సిన ప్రభుత్వం చివరికి అదుపు చేయలేక లాఠీలతో చెదరగొట్టింది. శనివారం సరూర్‌నగర్ స్టేడియానికి దాదాపు 5 వేల మందికి పైగా అభ్యర్థులు తరలిరావడం రాష్ట్రంలో నిరుద్యోగ తీవ్రతను కండ్లకుగట్టింది. మరిప్పుడు ముఖ్యమంత్రి ప్రకటనల్లో ఏది నిజం? ఎంత నిజం?
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నిరుద్యోగం ఎంతలా తాండవిస్తున్నదో చెప్పడానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది ఈ ఎంపిక ప్రక్రియ. రెండున్నరేండ్లుగా ఒక్క నోటిఫికేషన్ వేయకుండా ఇబ్బంది పెడుతున్న సర్కార్ తీరును ఈ దృశ్యం ఎండగట్టింది. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలికి అధికారంలోకి వచ్చాక చేయిచ్చిన సర్కార్ తీరుతో నిరుద్యోగుల ఆశలు గల్లంతు కాగా, ఇక తాత్కాలిక ఉద్యోగాల వైపు మళ్లాల్సిన పరిస్థితి నెలకొన్నది.
హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో శనివారం హైడ్రాలో 50 తాత్కాలిక డ్రైవర్, 100 డీఆర్ఎఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు ఉంటాయని.. దరఖాస్తు చేసుకున్నవారు శనివారం, ఆదివారం ఉదయం 5 గంటలకు రావాలని ప్రకటించారు. దీంతో రెండున్నరేండ్లుగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది నిరుద్యోగులు పోటెత్తారు. కేవలం 150 తాత్కాలిక ఉద్యోగాల కోసం సుమారు 5వేల మంది నిరుద్యోగులు స్టేడియానికి చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో అభ్యర్థులు రావడంతో నిర్వాహకులు నోరెళ్లబెట్టాల్సిన పరిస్థితి ఎదురైంది. ఒకనొక దశలో నిరుద్యోగులను అదుపు చేయలేక చేతులెత్తేశారు.

పోటెత్తిన నిరుద్యోగం : సరూర్‌నగర్ స్టేడియంలో నిరుద్యోగులను లాఠీలతో బెదిరిస్తున్న సిబ్బంది
దేహదారుఢ్య పరీక్షలకు తరలివచ్చిన నిరుద్యోగులతో సరూర్‌నగర్ స్టేడియం కిక్కిరిసిపోయింది. నిరుద్యోగుల రాకపై హైడ్రా సిబ్బంది అంచనా వేయకపోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. దేహదారుఢ్య పరీక్ష కోసం దరఖాస్తు పత్రాలు ఇచ్చేందుకు ఒక్కసారిగా అధికారుల వైపు దూసుకురావడంతో నిరుద్యోగుల మధ్య తోపులాట జరిగింది. ఊహించిన దానికంటే ఎక్కుమంది రావడంతో ఒక దశలో పోలీసులు లాఠీచార్జి చేయబోయారు. ఈ క్రమంలో అధికారులు దూషణల పర్వం మొదలు పెట్టారు.
ఇంత మంది వస్తే ఈవెంట్స్ ఎలా నిర్వహించాలని అభ్యర్థులనే ప్రశ్నించారు. టోకెన్లు తీసుకున్న వారు మాత్రమే ఉండాలని, మిగతా వాళ్లు వెళ్లిపోవాలని పేర్కొన్నారు. లేదంటే ఒక్కొక్కరినీ ‘ఐడెంటిఫై’ చేస్తామంటూ బెదిరింపులకు దిగారు. హైడ్రా సిబ్బంది తీరుపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షలకు రమ్మని పిలిచి ఇంత మంది వస్తే ఎలా నిర్వహిస్తామనడం అధికారుల చేతకానితనానికి నిదర్శనమని మండిపడ్డారు. 150 తాత్కాలిక ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఇన్ని తంటాలు పడుతున్న ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తుందంటే ఎలా నమ్ముతామని ఎద్దేవా చేశారు.