ఉన్న స్థిత నుంచి ఉన్నత స్థాయికి వెళ్లడమే అభివృద్ధి. ఒకనాడు కరువు కాటకాలతో తిండి గింజలకు అల్లాడిన ఉమ్మడి నల్లగొండ జిల్లా నేడు దేశానికి పట్టెడన్నం పెడుతున్నది. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ సంకల్పంతో నీళ్లు, నిధులు, ఉచిత్ విద్యుత్‌తో ఉన్నత స్థాయికి ఎదిగిన రైతాంగాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మళ్లీ అథఃపాతాళానికి తొక్కేందుకు కుట్రలు పన్నుతున్నది. కేంద్ర పౌర సరఫరాల మంత్రి పీయూష్ గోయల్ మాటల్లో ఆ అక్కసు మారోమారు బట్ట బయలైంది. ‘తెలంగాణ ప్రజలకు నూకలు తినడం అలవాటు చేయండి. వడ్ల కొనుగోలు సమస్య ఆటోమెటిక్‌గా పరిష్కారమవుతుంది’ అంటూ గోయల్ అహంకారాన్ని ప్రదర్శించడంపై రైతులు భగ్గుమంటున్నారు. వెకిలి మాటలతో రైతు కష్టాన్ని, తెలంగాణ సమాజం ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన కేంద్ర మంత్రి భేషరతుగా క్షమాపణ చెప్పాలని, రాష్ట్రంలో పండిన వడ్లను పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రైతుతో పెట్టుకున్న రాజ్యమేదీ ముందర పడలేదని, తీరు మారకుంటే తాము నూకలు తినడం కాదు, బీజేపీ సర్కారుకు నూకలు చెల్లినట్టేనని హెచ్చరించారు. వివిధ వర్గాల ప్రజలు సైతం వారికి మద్దతుగా నిలుస్తున్నారు.
ప్రాజెక్టులు, విద్యుత్ అందుబాటులో లేని కాలంలో గొట్టొడ్లు, నూకలు తినడం మహాభాగ్యమే. ఒక్క పూట వరి అన్నం తినడం గొప్పగా భావించేవారు. పరాయి పాలనలో అరకొర నీళ్లు, ఎప్పుడొస్తుందో తెలియని కరంటు రైతాంగానికి నిత్యం సవాలుగానే మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో సమృద్ధిగా సాగునీరు, నిరంతర విద్యుత్ అందుతున్నది. వరి సాగు విస్తృతంగా పెరిగింది. యాసంగి సేద్యం ఏడేండ్లలో నాలుగింతలైంది. సరిగ్గా ఇదే సమయంలో కేంద్రం కుట్రలకు తెరలేపింది. యాసంగిలో సన్నబియ్యంకావాలంటూ కొర్రీలు పెడుతున్నది. పైగా నూకలు తినడం మీ ప్రజలకు అలవాటు చేయమంటూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలపై ప్రజలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
ధాన్యం కొనుగోళ్ల విషయమై కేంద్ర ప్రభుత్వం కిరికిరి పెడుతుండడంపై రైతాంగంలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తనతో సమావేశమైన మంత్రుల బృందంతో ‘మీ ప్రజలకు నూకలు తినడం అలవాటు చేయండి’ అంటూ హేళనగా మాట్లాడడంపై సామాన్యులు సైతం మండిపడుతున్నారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, ఉచిత కరంటు, వ్యవసాయ రంగానికి ప్రోత్సాహం కారణంగా సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది. 2014కు ముందు ఉమ్మడి జిల్లాలో సాగు విస్తీర్ణం 13లక్షల ఎకరాలు మాత్రమే కాగా, ప్రస్తుతం 21లక్షల ఎకరాలకు పెరిగింది. నాలుగు రెట్లు అధికంగా యాసంగిలో వరి సాగవుతున్నది. నాగార్జునసాగర్ ఆయకట్టుకు అదనంగా సూర్యాపేట జిల్లాలో గోదావరి జలాలు కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా ఎస్ఆర్ఎస్పీ కాల్వలో పరుగులు తీస్తూ ప్రతి ఎకరాన్నీ తడుపుతున్నాయి. ఓ వైపు కృష్ణానీటిలో నిక్కచ్చిగా వాటా వినియోగం, మరోవైపు గోదావరి జలాలు, ఇంకో వైపు చిన్ననీటివనరుల వినియోగంతో సాగు పెరిగింది. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏటా రెండు పంటలు పండుతున్నాయి. వరి సంవృద్ధిగా సాగవుతున్న తరుణంలో కేంద్రం కుట్ర పూరితంగా వ్యవహరిస్తుండడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
యాసంగిలో రారైస్ ఇవ్వడం సాధ్యం కాదంటూ రాష్ట్ర మంత్రులు, ఎంపీలు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు వివరించగా.. ‘నూకలు తినడం అలవాటు చేయండి’ అంటూ హేళనగా మాట్లాడడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాభై ఏండ్ల కిందట వర్షాధార పంటలైన సజ్జలు, జొన్నలు, రాగులు ఆహారంగా తీసుకునేవారు. గతంలో సాగునీటి వసతి లేకపోవడం, విద్యుత్ కోతల కారణంగా వరి సాగు అంతంత మాత్రంగానే ఉంది. కొద్ది మంది నూకలు వండుకునేవారు. నీరు అందుబాటులోకి వచ్చాక వరి సాగు పెరిగిం సన్న బియ్యం అందరికీ అందుబాటులోకి వచ్చింది. స్వరాష్ట్రంలో వ్యవసాయానికి పెద్ద పీట వేసిన నేపథ్యంలో ఎక్కడ చూసినా వరి సాగు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తిరిగి నూకలు తినాలంటూ కేంద్ర మంత్రి మాట్లాడడంపై రైతులు మండిపడుతున్నారు. మళ్లీ యాభై ఏండ్లు వెనక్కి పోవాలా అని ప్రశ్నిస్తున్నారు. అవమానకర వ్యాఖ్యల్ని తక్షణమే ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
గత యాసంగి నుంచి కేంద్ర ప్రభుత్వ కుట్రలు మొదలయ్యాయి. వరి ధాన్యం కొనుగోలు విషయంలో రకరకాల ఆంక్షలు పెడుతూ రైతాంగాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నది. వాస్తవంగా ఉమ్మడి జిల్లాలోని భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో యాసంగిలో దొడ్డురకం ధాన్యం పండించడం అనివార్యం. సన్నాలు సాగు చేస్తే మిల్లు మర ఆడించే సమయంలో నూకలుగా మారుతాయి. నూకలకు మార్కెట్లో డిమాండ్ ఉండకపోవడంతో పాటు ఎఫ్‌సీఐ కూడా తీసుకోదు. ఈ పరిస్థితుల్లోనే తప్పనిసరిగా దొడ్డురకం సాగు చేయడం రైతులకు అలవాటు. జిల్లా పరిధిలోనే ఆ ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఎఫ్‌సీఐకి ఇచ్చేందుకు బాయిల్డ్ రైస్ మిల్లులే ఏర్పాటయ్యాయి. దీంతో ఏటా యాసంగిలో దొడ్డురకం ధాన్యాన్ని బాయిల్డ్ రైస్‌గానే సేకరిస్తున్న కేంద్రం ఈ సారి సన్నాలు కావాలంటూ కొర్రీలు పెడుతున్నది. ఇదే ప్రస్తుతం రైతుల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతుంది. పచ్చిబియ్యం ఇవ్వాలంటే సన్నాలు పండించక తప్పుదు. కానీ సన్నాల సాగుకు యాసంగి అనుకూలంగా ఉండదు. ఇదంతా తెలిసీ మోదీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుండడం పట్ల జిల్లా రైతాంగంలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం కుట్రలను గుర్తించిన జిల్లా రైతాంగం సీజన్ ప్రారంభంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జిల్లా పర్యటనకు వస్తే తిరగబడి తరిమికొట్టడం విదితమే.
రైతులను అవమానపర్చిన ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాగించలేదు. వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. వడ్లు కొనకుండా తెలంగాణ ప్రజలను అవమానించేలా మాట్లాడిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తక్షణమే క్షమాపణ చెప్పాలి. ఇప్పటికైనా తెరచాటు నాటకాలు మానుకుని ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలి. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన తప్పదు. బీజేపీ నాయకులను గ్రామాల్లో తిరుగకుండా అడ్డుకుంటాం.
– మట్టిపెల్లి సైదులు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, సూర్యాపేట రూరల్
తెలంగాణ ప్రజలు నూకలు తినాలని అవమానకర వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తక్షణమే క్షమాపణలు చెప్పాలి. రాష్ట్రంలో వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకపోగా బాధ్యతాయుతమైన కేంద్ర మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణం. సీమాంధ్ర ప్రభుత్వాల దోపిడీ వల్ల ఒకప్పుడు తెలంగాణ ప్రజలు గత్యంతరం లేక నూకలు తిని ఉండొచ్చు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్ఎస్ సర్కారు తీసుకొచ్చిన సంస్కరణలతో రాష్ట్ర ప్రజలు ఉన్నతమైన జీవితాన్ని గడుపుతున్నారనే విషయాన్ని బీజేపీ పెద్దలు గుర్తుంచుకోవాలి.
– ఎల్లంకి యాదగిరిగౌడ్, రైతుసంఘం నాయకుడు, కొరటికల్, మునుగోడు
కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మతిభ్రమించి మాట్లాడుతున్నడు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో తెలంగాణ పట్ల చిన్నచూపు చూస్తూ రైతుల మనోభావాలను దెబ్బతీసేలా కేంద్రం వ్యవహరిస్తున్నది. వివక్ష చూపుతున్న కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రైతాంగం తప్పకుండా బుద్ధి చెప్తుంది. రైతుల సంక్షేమానికి సహకరించాల్సింది పోయి మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సరైన సమయంలో బీజేపీకి బుద్ధి చెప్తాం.
– కాత్రోజు దుర్గాప్రసాద్, ఆర్ఎంపీ, మిర్యాలగూడ టౌన్
దేశ వ్యాప్తంగా ఒకే విధానం అమలు చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపడం సరికాదు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా వ్యవహరించడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమను కనబరుస్తున్నది. తెలంగాణ రైతులు నూకలు తినడం అలవాటు చేసుకోవాలని అనడం సిగ్గుచేటు. వెంటనే వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలి. లేకుంటే రైతు ఉద్యమాలు చేయాల్సి వస్తుంది.
– రమావత్ రవీందర్‌నాయక్, మఠంపల్లి, రైతు