2022 లో ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగొచ్చని వార్తలు వస్తున్న నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒకవేళ రష్యా ఉక్రెయిన్కై దాడికి దిగితే మాత్రం ఆర్థికపరమైన ఆంక్షలు విధించడానికి తాము సిద్ధంగా ఉన్నామని నర్మగర్భ వ్యాఖ్యలు చేసింది. అయితే దీనిపై పూర్తి తరహాలో నిర్ణయం తీసుకోలేదని సమాచారం. కానీ… ఈ దిశగానే యూరోపియన్ యూనియన్ కదులుతున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై యూరోపియన్ యూనియన్ అధ్యక్షుడు ఉర్సులావాన్ డేర్లేన్ స్పందించారు. రష్యాను కాస్త నిలువరించడానికి ముందు నుంచే తాము ఆర్థికపరమైన ఆంక్షలను విధించామని, పొరుగునే ఉన్న ఉక్రెయిన్‌పై దాడికి దిగితే మాత్రం ఆ ఆంక్షలను మరింత పెంచుతామని తేల్చి చెప్పారు. ఆంక్షలే కాకుండా, ఇతరత్రా చర్యలు కూడా తీసుకునేందుకు వెనకాడే ప్రసక్తే లేదని ఆయన ప్రకటించారు.
ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా లక్ష మంది సైనికులను, యుద్ధ ట్యాంకులను మోహరించింది. వచ్చే సంవత్సరం జనవరి నాటికి ఆ సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉందని ప్రపంచ దేశాలు అంచనా వేస్తున్నాయి. వీలు చిక్కినప్పుడల్లా రష్యా సైనికులు ఉక్రెయిన్ సైనికులను చంపుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాలు ఉక్రెయిన్‌కు మద్దతుగా రంగంలోకి దిగుతున్నాయి. అవసరమైన విధంగా సహాయం చేస్తూనే ఉన్నాయి.
ముందే పసిగట్టి… చైనా వైపు మొగ్గు చూపుతున్న పుతిన్
ఉక్రెయిన్‌పై దాడి చేసేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ సిద్ధపడినట్లు ప్రపంచ దేశాలు అంచనాకు వచ్చేశాయి. ఇలా దాడికి దిగితే, వచ్చే ప్రతిబంధకాలను కూడా పుతిన్ ముందే అంచనా వేసినట్లుగా ఆయన చర్యలు చెబుతున్నాయి. ఉక్రెయిన్‌పై దాడికి దిగితే రష్యాపై ఆర్థిక ఆంక్షలు తప్పవని హెచ్చరిస్తూనే ఉన్నారు. దీంతో రష్యా అధ్యక్షుడు పుతిన్ చైనా వైపు చూస్తున్నారు. కొన్ని రోజుల కిందటే రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధినేత జిన్‌పింగ్ వర్చువల్ భేటీ నిర్వహించుకున్నారు.
ఇరు దేశాలు చాలా పాత స్నేహితులని జిన్‌పింగ్ వ్యాఖ్యానించారు. తాము తమ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్న సందర్భాల్లో తమ వైపు రష్యా గట్టిగా నిల్చుందని జిన్‌పింగ్ పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న స్నేహితాన్ని కొందరు ముక్కలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇరు దేశాలు కొన్ని రంగాల్లో కలిసి నడవడానికి ప్రణాళికలు రూపొందిస్తామని జిన్‌పింగ్ పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న బంధం భాగస్వామ్యం కంటే ఉన్నతమైనదిగా ఆయన అభివర్ణించారు.